Let's talk: editor@tmv.in
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట…

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట…

Sirisha B
25 జనవరి, 2026

నకిలీ మద్యం కేసులో 83 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్ పొందిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు జైలునుంచి విడుదలయ్యారు. విడుదలైన వారికి మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పెనమలూరు పార్టీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు.

జైలు నుండి బయటకి రాగానే మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, "అక్రమ కేసులు పెట్టి నన్ను, నా సోదరుడిని 83 రోజుల పాటు జైల్లో ఉంచారు. నా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. చివరికి నా భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు. కానీ ఈ కేసులు, అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు. రెట్టించిన ఉత్సాహంతో నేను ప్రజా సేవ చేస్తాను అని అన్నారు.

ఈ సందర్బంగా, లోకేష్, నీ రెడ్ బుక్‌ను మడిచిపెట్టు. మీ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని పేర్కొన్నారు. జోగి రమేష్ సోదరుల విడుదల పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును నకిలీ మద్యం కేసులో 2025 నవంబర్ 3 న ఎక్సైజ్, సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ రోజు ఇద్దరిని ఇంటి నుంచి విచారణ కోసం తీసుకొచ్చారు. తదుపరి వారికి కోర్టు జుడిషియల్ కస్టడీ విధించింది. అయన పై అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయించిన నేరాల కింద అరెస్ట్ చేశారు. అప్పటినుండి జోగి రమేష్ జైలులోనే ఉన్నారు.

కేసు నేపథ్యం:

నకిలీ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముపై ఎక్సైజ్ శాఖ మరియు సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 2025 నవంబర్ 3న వీరిద్దరినీ అధికారులు అరెస్ట్ చేయగా, కోర్టు వీరికి జుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తు సంస్థలు సమర్పించిన ప్రాథమిక ఆధారాలు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి గతంలో బెయిల్ నిరాకరించబడగా, సుమారు 83 రోజుల జైలు శిక్ష అనంతరం తాజాగా వీరికి కోర్టు నుంచి ఊరట లభించింది.

ఇటీవల నకిలీ మద్యం మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధానంగా ఎంపీ విజయసాయి రెడ్డిని (A5) ఈడీ అధికారులు జనవరి 22న 6 గంటల పాటు విచారించగా, జనవరి 24న మరోసారి విచారణకు పిలిచారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా మనీలాండరింగ్ కోణంలో జనవరి 23న సుమారు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఈయన గతంలోనే అరెస్ట్ అయి సెప్టెంబర్ 30న బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు 83 రోజుల జైలు శిక్ష తర్వాత జనవరి 23, 2026న విడుదల కాగా, అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి వంటి నేతలు దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నారు. సుమారు రూ. 3,500 కోట్ల అవినీతి జరిగినట్లు అంచనా వేస్తున్న సిట్, ఈడీ అధికారులు, నిధుల మళ్లింపు, హవాలా ఆరోపణలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట… - Tholi Paluku