
నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణం: ఆరు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
నకిలీ ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖల ద్వారా ఉద్యోగార్థులను మోసం చేసిన నేరగాళ్ల ముఠాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆరు రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ఉదయం వేకువజాము నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ సోదాలను పాట్నా ఈడీ జోనల్ కార్యాలయం రాష్ట్ర పోలీసు బలగాలతో సమన్వయంగా నిర్వహిస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బీహార్‌లో ముజఫర్‌పూర్, మోతిహారి, పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పాండలం, అదూర్, కొడూర్, తమిళనాడులో చెన్నై, గుజరాత్‌లో రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ , ప్రయాగ్‌రాజ్ , లక్నో ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది.
మొదట ఈ కుంభకోణం భారతీయ రైల్వేల పేరుతో వెలుగులోకి వచ్చినప్పటికీ, లోతైన దర్యాప్తులో ఇది 40కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో అటవీ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇండియా పోస్ట్, ఆదాయ పన్ను శాఖ, కొన్ని హైకోర్టులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), బీహార్ ప్రభుత్వం, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ), రాజస్థాన్ సెక్రటేరియట్ తదితర శాఖలు ఉన్నాయి. దర్యాప్తు వివరాలు తెలిసిన అధికారుల ప్రకారం, నిందితులు ప్రభుత్వ అధికారిక డొమైన్‌లను అనుకరించే నకిలీ ఈ మెయిల్ ఖాతాలను ఉపయోగించి ఉద్యోగార్థులకు ఫర్జీ నియామక, జాయినింగ్ లేఖలు పంపించారు. ఉద్యోగార్థుల నమ్మకాన్ని సంపాదించేందుకు, భారతీయ రైల్వేలకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్), ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), టెక్నీషియన్ వంటి పోస్టుల్లో నకిలీగా నియమించిన కొంతమందికి మొదటి రెండు నుంచి మూడు నెలల పాటు జీతాలు కూడా చెల్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలపై ఈడీ విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
