
నకిలీ నెయ్యి ఫ్యాక్టరీ గుట్టు రట్టు
కల్తీ ఆహార ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగల సీజన్‌లో ఇటువంటి కల్తీ వ్యాపారాలు విపరీతంగా పెరిగి, వినియోగదారులకు పెద్ద ముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత నమ్మకమైన ఉత్పత్తుల్లో ఒకటైన దేశీ నెయ్యిని సైతం నకిలీ చేసి విక్రయిస్తున్న ఒక భారీ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. బావానా పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఈ యూనిట్‌పై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు, పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారులకు అందిన పక్కా సమాచారం ఆధారంగా ఈ దాడి జరిగింది. హర్యానాకు చెందిన సతేందర్ (44) ప్రవీణ్ (29) అనే నిందితులు రిఫైన్డ్ ఆయిల్, ఇతర నాణ్యత లేని పదార్థాలను కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన ఈ నకిలీ ఉత్పత్తిని అత్యంత ప్రజాదరణ పొందిన వివిధ దేశీ నెయ్యి బ్రాండ్‌ల పేరుతో ప్యాకింగ్ చేసి, అమ్ముతున్నారు.
పోలీసులు జరిపిన ఈ దాడిలో సుమారు 3,700 లీటర్లకు పైగా నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2,500 లీటర్ల ప్యాక్ చేసిన 1,200 లీటర్ల ప్యాక్ చేయని నిల్వలు ఉన్నాయి. నకిలీ నెయ్యితో పాటు, పోలీసులు రిఫైన్డ్ ఆయిల్ కంటైనర్‌లు, పెద్ద ఎత్తున ముడి పదార్థాలు, వేడి చేయడానికి, కలపడానికి ఉపయోగించే యంత్రాలు (హీటింగ్, మిక్సింగ్ యూనిట్లు, బ్లెండర్లు) స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఉత్పత్తిని అసలు బ్రాండ్‌ల మాదిరిగా కనిపించేలా చేయడానికి ఉపయోగించే సీలింగ్, టెట్రా-ప్యాకింగ్ యంత్రాలు, వివిధ సామర్థ్యాల (100 మి.లీ నుంచి 5 లీటర్ల వరకు) వేలాది ఖాళీ పౌచ్‌లు, జాడీలు, బ్రాండ్ లేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నెయ్యి తయారీకి ప్రధాన సూత్రధారి అయిన సతేందర్ గతంలో సోనిపట్‌లో సాధారణ చమురు కేక్‌ల వ్యాపారం నిర్వహించేవాడని, ఆపై అక్రమ వ్యాపారంలోకి మారాడని తేలింది. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన ప్రవీణ్, సుమారు సంవత్సర కాలంగా బావానా యూనిట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ సతేందర్‌తో చేతులుకలిపి ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కల్తీ నెయ్యి సరఫరా నెట్‌వర్క్‌ను ఈ మోసంలో భాగస్వాములైన ఇతరుల వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
