Let's talk: editor@tmv.in
నకిలీ ఇన్వాయిస్‌లతో రూ. 5.83 కోట్ల మోసం

నకిలీ ఇన్వాయిస్‌లతో రూ. 5.83 కోట్ల మోసం

Panthagani Anusha
12 జనవరి, 2026

నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ఓ భారీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాన్ని డీజీజీఐ విశాఖ జోనల్ అధికారులు ఛేదించారు. ఎటువంటి వస్తువులు సరఫరా లేకుండానే తప్పుడు పత్రాలతో రూ. 5.83 కోట్ల పన్ను రాయితీ పొందిన ‘ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్స్’ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ డీఎన్. శ్రీనివాస రెడ్డిని అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

సాధారణంగా వ్యాపారస్తులు వస్తువులు కొన్నప్పుడు కట్టిన పన్నును తిరిగి అమ్ముతున్నప్పుడు మినహాయించుకోవడాన్ని 'ఐటీసీ' అంటారు. అయితే అసలు క్షేత్రస్థాయిలో ఎక్కడా లేని కేవలం కాగితాలకే పరిమితమైన (షెల్ కంపెనీలు) సంస్థల పేర్లతో శ్రీనివాస రెడ్డి నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి సబ్‌కాంట్రాక్టు పనులు జరిగినట్లు రికార్డుల్లో చూపిస్తూ డమ్మీ సంస్థల నుంచి బిల్లులు పొంది అక్రమంగా ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

కమీషన్ ఏజెంట్ల ద్వారా నిధుల మళ్లింపు

కాగా ఈ వ్యవహారంలో మల్లికార్జున మనోజ్ కుమార్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా వ్యవహరించారు. ఆయన ఒక డమ్మీ సంస్థను నడుపుతూ శ్రీనివాస రెడ్డికి కావాల్సిన నకిలీ బిల్లులను అందజేసేవారు. ఇందుకోసం 3 శాతం కమీషన్ తీసుకుని మిగిలిన డబ్బును వివిధ 'మ్యూల్' అకౌంట్ల (ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాలు) ద్వారా దారి మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ కేసులో మనోజ్ కుమార్‌ను అధికారులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ స్కామ్‌లో శ్రీనివాస రెడ్డినే ప్రధాన లబ్ధిదారుడని నిర్ధారించిన అధికారులు, ఆయనపై సీజీఎస్టీ చట్టం–2017లోని సెక్షన్ 132(1)(సి) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నమోదైన నేరాలకు బెయిల్ రావడం కష్టమని అధికారులు తెలిపారు. కాగా ఇదే ఆర్థిక సంవత్సరం (2025–26)లో జీఎస్టీ ఎగవేతలు, ఐటీసీ మోసాలపై విశాఖపట్నం జోనల్ యూనిట్ చేపట్టిన ఐదవ అరెస్ట్ కావడం గమనార్హం.