Let's talk: editor@tmv.in
నకిలీ ఆఫీసర్ ముసుగులో ఆన్‌లైన్ దోపిడీ

నకిలీ ఆఫీసర్ ముసుగులో ఆన్‌లైన్ దోపిడీ

Panthagani Anusha
28 సెప్టెంబర్, 2025

ఆన్‌లైన్ మోసాలు, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరో ఘటన తాజాగా ఢిల్లీలో చోటుచేసుకుంది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటిస్తూ అమాయకపు జనాలని నమ్మించి ఆన్లైన్ లైన్ మోసానికి పాల్పడుతున్న ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మోసాల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అయిన నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన తస్లీమ్ ఖాన్గా గుర్తించారు. నకిలీ ఇన్వాయిస్‌లు, లెటర్ హెడ్‌లను ఉపయోగించి అనేక మందిని మోసం చేసాడని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను ఆరెస్ట్ సమయంలో ఖాన్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు.

అయితే ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తస్లీమ్ ఖాన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటించి ఒక వ్యక్తి తనను మోసం చేసి రూ. 2.52 లక్షలకు పైగా అపహరించాడని ఆమె ఆరోపించింది.అంతేకాక నిందితుడు తనను నమ్మించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెటర్ హెడ్‌తో కూడిన నకిలీ లేఖలు, ఫేక్ ఇన్‌వాయిస్‌లను పంపినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. వాటిని చూపించి టోకెన్ ఫీజులు, ఇతర ఛార్జీల పేరుతో ఆమె వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితురాలు ఆరోపించింది.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా డబ్బు బదిలీ జరిగిన మార్గాన్ని (మనీ ట్రయల్‌) ట్రాక్ చేశారు. దీని ద్వారా నిందితుడి ఆచూకీ అల్వార్‌లో ఉందని తెలుసుకున్న అధికారులు వెంటనే అల్వార్‌లోని రామ్‌గఢ్ ప్రాంతంలో ముకుంద్వాస్ గ్రామంలో రైడ్ చేసి ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏడుగురు బాధితుల గుర్తింపు

అదుపులోకి తీసుకున్న తర్వాత, ఖాన్ ను పోలీసులు విచారించగా థానే ఈ మోసాలకు పాల్పడినట్టు అగీకరించడం తోపాటుగ ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటిస్తూ, ఫోర్జరీ పత్రాలతో ప్రజలను నమ్మించి మోసాలు చేసేవాడినని వెల్లడించాడు. దీంతో ఖాన్ వద్దనుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను పరిశీలించగా అనేక మంది బాధితులతో జరిగిన మోసపూరిత సంభాషణలు బయటపడ్డాయి. కాగా ఈ స్కామ్‌లో ఇప్పటికే ఏడుగురు బాధితులు ఉన్నట్లు గుర్తించామని, ఇంకా ఎంతమంది మోసపోయారనే దీనిపై కూపీ లాగుతున్నామని డీసీపీ తెలిపారు. అదేవిదంగా ఈ మోసాలలో ఖాన్‌తో పాటు మరికొందరు నిందితులు పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

నకిలీ ఆఫీసర్ ముసుగులో ఆన్‌లైన్ దోపిడీ - Tholi Paluku