Let's talk: editor@tmv.in
"నకిలీ"మద్యం వ్యవహారం... టీడీపీ దిద్దుబాటు చర్యలు

"నకిలీ"మద్యం వ్యవహారం... టీడీపీ దిద్దుబాటు చర్యలు

FL - SIMHCLM
7 అక్టోబర్, 2025

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో వెలుగుచూసిన అక్రమ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ డిఫెన్స్ లో పడింది. ఆ లిక్కర్ తయారీ.. వాటి అమ్మకం.. సరఫరా.. ఈ సప్లై చైన్ వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు ఆధారాలతో వెల్లడించడంతో టీడీపీ ఇక ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికె మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ.. స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి అంశాల్లో జనంలో పలచబడిన టీడీపీ ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసినట్లు జనానికి తెలియడంతో ఇక సర్దుబాటు.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు

ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ పల్లా ప్రకటన విడుదల చేశారు. ఈ ఇద్దరి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్‌, సన్నిహితుడు జనార్దన్‌రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జయచంద్రారెడ్డి, కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్‌రావు దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తెలిసింది. జయచంద్రారెడ్డి వ్యవహారం మొదట నుంచీ వివాదాస్పదంగానే ఉందని చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన జనచంద్రారెడ్డి మొన్నటి ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏమాత్రం కృషి చేయలేదని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచీ నియోజకవర్గంలో అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుని వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోవడంతో అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది. ఇదిలా ఉండగా ఈ మద్యం వ్యవహారంలో వైసిపి జోరుగా పోరాటం చేస్తోంది.. టీడీపీ ఏకపక్షంగా రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కల్తీ.. నకిలీ మద్యాన్ని అమ్మతోందని.. విషంతో సమానమైన ఈ మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని వైసిపి ప్రచారం చేస్తోంది..

మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా ఒక టీడీపీ నాయకుడి ఇంటి వద్ద భారీగా నకిలీ మద్యం డంప్ పట్టుబడింది.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో వెలుగుచూసిన అక్రమ మద్యం ఫ్యాక్టరీకి సంబంధించిన మద్యం ఇక్కడికి సరఫరా అయిందని.. అది రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని వైసిపి ఆరోపిస్తోంది.. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు టిడిపి నాయకుడి ఇంటివద్ద ఇలా భారీగా నకిలీ మద్యం బయటపడింది.

"నకిలీ"మద్యం వ్యవహారం... టీడీపీ దిద్దుబాటు చర్యలు - Tholi Paluku