Let's talk: editor@tmv.in
నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు

నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు

Panthagani Anusha
21 సెప్టెంబర్, 2025

లోన్ బకాయిల వసూలు పేరుతో ప్రజలను బెదిరిస్తూ, అసభ్యకర సందేశాలు పంపుతూ , ఆటోమేటిక్ కాల్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఒక నకిలీ కాల్ సెంటర్‌ను గుట్టును గురుగ్రామ్ పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో ఏడుగురు మహిళా ఉద్యోగులతో పాటు కాల్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు..

కాగా కాల్ సెంటర్ వేధింపులకు గురైన ఓ బాధిత మహిళ సెప్టెంబర్ 12న సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ (ఈస్ట్)లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బాధితురాలికి అనేకసార్లు అపరిచిత నంబర్ల నుంచి అసభ్యకరంగా, అశ్లీల పదజాలంతో వాయిస్ నోట్స్‌ పెట్టేవారని, అదే పనిగా కాల్స్​ చేస్తూ వేధించారని తెలిపింది. ఇక బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఢిల్లీలోని డాబ్డీ ప్రాంతంలో ఉన్న ఓ కాల్ సెంటర్‌పై దాడి చేసి అక్కడ పనిచేస్తున్న గజాలా ప్రవీణ్, ఈషా వర్మ, కహ్కషా బానో, మౌరిస్ సిన్హా, రీనా బిష్ట్, రోష్ని, రోజీతో పాటు నిర్వాహకుడు ముఖేష్ చౌహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 10 మొబైల్ ఫోన్లు, 26 సిమ్ కార్డులు, డయలర్ మెషీన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రియాంశు దేవాన్ మాట్లాడుతూ అరెస్టైన వారు లోన్ డీఫాల్టర్లకు, కుటుంబ సభ్యులకు తరచూ కాల్స్ చేసేవారని కాల్స్ సమయంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి, అభ్యంతరకర వాయిస్ నోట్స్ పంపించేవారు. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వారికి కాల్ చేసి వేధించేవారని పేర్కొన్నారు.

ఇక ముఖేష్ చౌహాన్ రెండు సంవత్సరాలుగా ఈ కాల్ సెంటర్ నడుపుతున్నాడని, బ్యాంక్‌కి సంబంధించిన లోన్ బకాయిల వసూలు చేసి అందుకు 17 శాతం కమిషన్ పొందేవాడని, అందులో మూడు శాతం కాల్ సెంటర్ ఉద్యోగినులకు ఇచ్చి, అదనంగా వారికి నెలకు రూ.15,000 జీతం చెల్లిస్తున్నారని ఏసీపీ తెలిపారు. ఇక అరెస్టైన వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, లోన్ రికవరీ పేరుతో ప్రజలను మానసికంగా వేధించడం వెనుక ఉన్న నిజమైన నెట్‌వర్క్ బయటపెడతామని చెప్పారు. ఇతర బ్యాంక్ ఏజెన్సీల ప్రమేయం ఉందేమో అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు - Tholi Paluku