
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదాలు ప్రజలను ప్రయాణమంటేనే భయపడేలా చేస్తున్నాయి ఇందుకు కారణం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాద ఘటనలు. పోయిన ఏడాది జరిగిన కర్నూలు అదేవిధంగా చేవెళ్ల రోడ్డు ప్రమాదాలు మరవకముందే నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకార 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున సుమారు 1.40 గంటల సమయంలో శిరివెళ్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. టైరు పేలిన వెంటనే బస్సు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, లారీ క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం వాహన డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టాడు. ప్రయాణికులను వెంటనే బయటకు రావాలని సూచించాడు. స్థానికులు, ఇతర వాహనదారుల సహాయంతో బస్సులోని ఎగ్జిట్ మార్గాల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. కిటికీల నుంచి దూకిన క్రమంలో పదిమందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా నలుగురికి ఎముకలు విరిగిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాహనాలు పూర్తిగా దగ్ధం…
కాగా ప్రమాద సమయంలో మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కంటైనర్ లారీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంతసేపు ట్రాఫిక్‌ను నిలిపివేసి పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ, టైరు పేలడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నాం. సకాలంలో ప్రయాణికులను బయటకు తరలించడంతో పెను ప్రాణనష్టం తప్పింది” అని తెలిపారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు కర్నూలు నుంచి ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
