Let's talk: editor@tmv.in
నంద్యాల జిల్లా డోన్ సమీపంలో ఘోర ప్రమాదం:ముగ్గురు మృతి

నంద్యాల జిల్లా డోన్ సమీపంలో ఘోర ప్రమాదం:ముగ్గురు మృతి

Panthagani Anusha
28 ఫిబ్రవరి, 2026

నంద్యాల జిల్లా డోన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఓ భారీ క్రేన్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన ప్రమోద్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. మధ్యాహ్నం సుమారు 1:40 గంటల సమయంలో డోన్ మండలం జగదూతి గ్రామం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ దారుణ ఘటనలో ప్రమోద్ భార్య, ఇద్దరు చిన్న పిల్లలు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించారు.

కారు నడుపుతున్న ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డోన్ సీఐ రాకేష్, ఎస్సై మమత వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ప్రమోద్‌ను కారులో నుంచి బయటకు తీసి 108 వాహనంలో డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్రేన్ తప్పుడు దిశలో (రాంగ్ రూట్) రావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి భారీ వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.