Let's talk: editor@tmv.in
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
27 డిసెంబర్, 2025

నంద్యాల జిల్లా పరిధిలోని జాతీయ రహదారి–40పై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గరకు రాగానే, అతివేగంగా ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు గాలిలోకి ఎగిరి రోడ్డుకు అవతలి వైపున పడగా సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న గుండె రావు, శ్రవణ్, నరసింహ, బన్నీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన సాయి, సిద్ధార్థ్‌లను పోలీసులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా నిజాంపేట్‌లో క్యాటరింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

మరోవైపు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్‌ ప్రాథమికంగా వెల్లడించారు.

ఇక ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్‌అండ్‌బీ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.