
నంది మేడారం రిజర్వాయర్ నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభం
తెలంగాణకు జీవధారగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. యాసంగి సాగు సీజన్‌లో అన్నదాతలకు భరోసా కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు మరోసారి కీలక పాత్ర పోషిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర వ్యవసాయ రంగానికి మైలురాయిగా నిలిచి, సాగునీటి సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తోంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామ పరిధిలోని నంది రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా పైకి తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీంతో పరిసర ప్రాంతాల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి పంటల సాగుకు అవసరమైన నీరు అందుబాటులోకి రావడంతో వరి, ఇతర పంటలపై రైతులు మరింత నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావడం వల్ల గతంలో వర్షాధారంపై ఆధారపడిన అనేక ప్రాంతాలకు స్థిరమైన సాగునీటి సౌకర్యం లభిస్తోంది. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా, పంట దిగుబడులు కూడా మెరుగుపడుతున్నాయి. రైతుల ఆదాయం పెరగడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. ప్రస్తుతం నంది రిజర్వాయర్ నుంచి ప్రారంభమైన ఎత్తిపోతలతో నీరు కాలువల ద్వారా పొలాలకు చేరనుండగా, వ్యవసాయ కార్యకలాపాలకు ఊపొస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలవడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఇది నిజంగా వరంగా మారిందని చెప్పవచ్చు.
