
నందిగ్రాంలో మళ్లీ టీఎంసీ పాగా వేసేనా?
పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రాం అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర పోరాటంగా మారింది. రాజకీయంగా పార్టీ మారడం, బీజేపీకి ఉన్న సంస్థాగత పట్టు, అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్)లో ఓటర్ల తొలగింపులపై వచ్చిన ఆరోపణలు కలిసి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మార్చాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2021 ఎన్నికల్లో సువేందు అధికారి, మమతా బెనర్జీపై కేవలం 1,956 ఓట్ల తేడాతో గెలిచిన సంఘటన బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపుగా నిలిచింది. ఆ ఎన్నికల్లో సువేందు అధికారి 1.1 లక్షలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. అప్పటికీ ఆయనకు నందిగ్రాం పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలో ఒక్కదాంట్లోనూ బలం లేకపోయినా, కనీసం రెండు పంచాయతీ సమితిల్లోనూ ఆధిపత్యం లేకపోయినా గెలుపొందడం అనుహ్యం. 2020 డిసెంబర్ 19న ఆయన తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే రాజకీయ సమీకరణాలను వేగంగా తనవైపునకు తిప్పుకున్నారు.
ఐదేళ్లలో బీజేపీకి గణనీయమైన పట్టు
గత ఐదేళ్లలో పరిస్థితి గణనీయంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నందిగ్రాం పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలో 11 పంచాయతీలు, అలాగే రెండు పంచాయతీ సమితిలు బీజేపీ ఆధీనంలోకి వచ్చాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో సువేందు అధికారి మరింత బలమైన స్థితిలో ఉన్నారని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ నియోజకవర్గంలో 8,200 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 49.49 శాతం ఓట్లు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు 45.87 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.
2007 ఉద్యమం నుంచి రాజకీయంగా కీలక కేంద్రం
2007లో జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమంతో నందిగ్రాం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రసాయన పరిశ్రమ కేంద్రానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేసిన నిరసనల సమయంలో మార్చి 14న జరిగిన పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించారు. ఈ సంఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఉద్యమం మమతా బెనర్జీకు రాజకీయ బలం ఇచ్చి, చివరకు 2011లో ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 34 సంవత్సరాల వామపక్ష పాలనకు ముగింపు పలికింది.
‘భూమిపుత్ర’ పోటీగా మారిన ఎన్నిక
ఈసారి నందిగ్రాంలో తృణమూల్ కాంగ్రెస్ పవిత్ర కార్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆసక్తికరంగా ఆయన గతంలో బీజేపీ నాయకుడిగా సువేందు అధికారికి సన్నిహితుడిగా పనిచేశారు. అభ్యర్థిత్వం ప్రకటించే కొన్ని గంటల ముందే ఆయన తృణమూల్‌లో చేరారు. దీంతో ఈ నియోజకవర్గం ‘భూమిపుత్రుడు వర్సెస్ భూమిపుత్రుడు’ (స్థానిక నేతల మధ్య పోటీ)గా మారింది. పవిత్ర కార్ భార్య శియులి కార్, బోయాల్ II గ్రామ పంచాయతీకి మాజీ ప్రధానిగా వ్యవహరించారు. 2021 ఎన్నికలకు ముందు జరిగిన ఒక టీఎంసీ కార్యకర్త హత్య కేసులో పవిత్ర కార్‌పై ఆరోపణలు నమోదై ఆయన జైలుకు కూడా వెళ్లిన విషయం ప్రస్తావనీయంగా ఉంది.
నందిగ్రాం తిరిగి గెలుచుకోవాలని టీఎంసీ ప్రయత్నం
2009 నుంచి 2016 వరకు మూడు సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి తిరిగి దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈ నియోజకవర్గంపై వ్యక్తిగతంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. మార్చి 25న నందిగ్రాంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీరు వచ్చే 25 రోజులు నియోజకవర్గ బాధ్యత తీసుకోండి… తర్వాత ఐదేళ్లు నేను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ సంవత్సరం ప్రారంభంలో ‘సేవాశ్రయ్’ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు.
అంతర్గత విభేదాలు టీఎంసీకి సమస్య?
సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రచార నిర్వాహకుడు ప్రలయ్ పాల్ మాట్లాడుతూ టీఎంసీకి ఈసారి పార్టీలోని అంతర్గత విభేదాలే పెద్ద సమస్యగా మారవచ్చని చెప్పారు.పవిత్ర కార్ వల్ల బీజేపీ ఓట్లు టీఎంసీకి వస్తాయని వారు ఆశిస్తున్నారు. కానీ అది జరిగే అవకాశం తక్కువ. పార్టీ పాత నాయకులు అసంతృప్తితో ఆయనకు వ్యతిరేకంగా పని చేసే అవకాశముందని ఆయన అన్నారు. అయితే నందిగ్రాంలోని I బ్లాక్‌లో బీజేపీకి కొంత గడ్డు పరిస్థితి ఉందని ఆయన అంగీకరించారు. అక్కడి 10 ప్రాంతాల్లో 5 ప్రాంతాలు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలు. బీజేపీ సాధారణంగా నందిగ్రాం Iలో వెనుకబడుతుండగా, నందిగ్రాం IIలో అధిక ఓట్లతో లోటును భర్తీ చేస్తుందని ఆయన తెలిపారు.
సర్ ఓటర్ల తొలగింపులపై ఆరోపణలు
కోల్‌కత్తాకు చెందిన ప్రజా విధాన పరిశోధనా సంస్థ సబర్ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషణ ప్రకారం నందిగ్రాంలో సర్ ప్రక్రియలో ఓటర్ల తొలగింపులో అసమానతలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నియోజకవర్గ జనాభాలో ముస్లింలు సుమారు 25 శాతం ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో 95.5 శాతం మంది ముస్లింలే ఉన్నారని నివేదిక పేర్కొంది. ముస్లిం కాని ఓటర్లను మాత్రం 4.5 శాతం మాత్రమే తొలగించారని తెలిపింది. సబర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సబీర్ అహ్మద్ మాట్లాడుతూ ఏఐ ఆధారిత పద్ధతులను ఉపయోగించి మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్లు తీసేశారనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
వామపక్షాల పరిస్థితి
2021 ఎన్నికల్లో సీపీఎం యువ నాయకురాలు మీనాక్షి ముఖర్జీ నందిగ్రాంలో పోటీ చేసి 3 శాతం కంటే తక్కువ ఓట్లు మాత్రమే సాధించారు. ఈసారి వామపక్ష కూటమి సంప్రదాయంగా ఈ స్థానంలో పోటీ చేసే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున శాంతి గిరి అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఏప్రిల్ 23న పోలింగ్
నందిగ్రాం నియోజకవర్గంలో పోలింగ్‌లో భాగంగా మొదటి దశలోనే (ఏప్రిల్ 23న) జరగనుంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పోరాటంగా మారిన ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది.
