
నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఈ బస్సు కంచికచర్ల మండలం కీసర (కేసర) టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే వెనుక ఇంజిన్ భాగంలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది.
పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 39 మంది ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన కొద్ది సేపటికే బస్సులో మంటలు చెలరేగి, పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సు దగ్ధానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై అధికారులు కఠిన తనిఖీలు నిర్వహించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
