Let's talk: editor@tmv.in
నందిగామలో బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు

నందిగామలో బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు

Panthagani Anusha
19 నవంబర్, 2025

నందిగామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని అనాసాగరం బైపాస్ వద్ద ప్రైవేట్ 'కావేరి ట్రావెల్స్' బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ విషయమై సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు అందించిన అదనపు సమాచారం ప్రకారం బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉండగా, ఢీకొన్న ప్రభావంతో బస్సు ఎడమ వైపు పూర్తిగా దెబ్బతింది.కాగా గాయపడిన ఎనిమిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ‘‘డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం అని వెల్లడించారు. నియమాలు ఉల్లంఘిస్తూ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ప్రమాదం జరిగింది పేర్కొన్నారు. ఈ విషయంమై రవాణా శాఖకు సమాచారం అందించారు. బస్సు సాంకేతిక స్థితి, అనుమతులు డ్రైవర్ డ్రైవింగ్ రికార్డు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన మార్గంలో ఇటీవల వేగ నియంత్రణ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు మరల మరల చోటుచేసుకోవడంపై ప్రయాణికుల భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.