Let's talk: editor@tmv.in
నందిగామలో 'డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ' ప్రారంభం

నందిగామలో 'డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ' ప్రారంభం

Panthagani Anusha
17 ఫిబ్రవరి, 2026

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. నందిగామలో ఏర్పాటు చేసిన 'డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ఇటువంటి అకాడమీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలని దానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏప్రిల్ 5న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో 'రూరల్ టాలెంట్ సెర్చ్' ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల క్యాంప్ నిర్వహించి, ఎంపికైన వారికి మూలపాడు క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. బీసీసీఐ తరహాలో మూలపాడులో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేస్తున్నామని, ఈసారి ఏపీఎల్ మ్యాచ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో జరుగుతాయని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు.

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో చిన్న క్రికెట్ మైదానాలు నిర్మిస్తున్నామని నందిగామ మంచినీటి సమస్య పరిష్కారానికి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, అకాడమీ ఎం.డి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో 'డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ' ప్రారంభం - Tholi Paluku