Let's talk: editor@tmv.in
ధైర్యం లేకుంటే పెద్ద ఛాతీ ఉన్నా వ్యర్థమే:రాహుల్ గాంధీ

ధైర్యం లేకుంటే పెద్ద ఛాతీ ఉన్నా వ్యర్థమే:రాహుల్ గాంధీ

Pinjari Chand
3 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ పై విరుచుకు పడుతున్నారు. మాటలతో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆదివారం బెగుసరాయిలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగిన ఆయన, చేతులతో చేపలు పట్టే సాంప్రదాయ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో వికాస్ షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) అధినేత, మహాఘట్భంధన్‌ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేశ్‌ సహనీ, కాంగ్రెస్‌ నేత కన్హయ్యా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. చేపల వేట అనంతరం జరిగిన ప్రజాసభలో రాహుల్‌ మాట్లాడుతూ బీహార్‌ రాష్ట్రపు మత్స్యకార సమాజం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. వీరి కష్టానికి, హక్కులకు నేను అండగా నిలుస్తాను అని హామీ ఇచ్చారు.

మోడీ ఓ కీలుబొమ్మ

ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కఠిన విమర్శలు గుప్పించారు. మోడీ అంబానీ, ఆదానీ చేతుల్లో కీలు బొమ్మలా మారిపోయారు. ఓట్ల కోసం ఏదైనా చేస్తారు. ఆయనను రెండు, మూడు యోగా ఆసనాలు చేయమంటే కూడా చేస్తారు అని రాహుల్‌ వ్యంగ్యంగా అన్నారు. మోడీ చెప్పే ‘56 అంగుళాల ఛాతీ’వ్యాఖ్యను మరోసారి రాహుల్ ప్రస్తావించారు. ధైర్యాన్ని ఛాతీ కొలతతో కొలవరు. గాంధీజీకి పెద్ద ఛాతీ లేదు, కానీ ఆయన భయపడలేదు. అయితే కొంతమందికి పెద్ద ఛాతీ ఉన్నా, ధైర్యం మాత్రం లేద అని చురకలంటించారు.

అమెరికా చెప్పిందని ఆపరేషన్ సింధూర్ ఆపేశారు

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సాగిన చర్యను అమెరికా ఒత్తిడితో మోడీ నిలిపేశారని ఆరోపించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేశాక మోడీ భయపడ్డారు. కానీ1971లో యుద్ధం జరిగినప్పుడు భారత సైన్యం పాకిస్తాన్‌తో పోరాడుతోంది. అమెరికన్ నేవీ ఇక్కడికి వచ్చింది. అమెరికన్ అధ్యక్షుడు (రిచర్డ్ నిక్సన్) బంగ్లాదేశ్‌లో ఏం జరిగినా యుద్ధాన్ని ఆపమని భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీని బెదిరించాడు. ఆమె వెనక్కి తగ్గలేదు. అమెరికా వారు కోరుకున్నది చేయాలి. దేశానికి కావాల్సింది చేస్తామని ఆమె చెప్పింది. మన ధైర్యమేందో అమెరికాకు చూపించామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

అదానీకి ఇవ్వడానికి భూమి ఉంది. బీహార్‌కి లేదా?

గతంలో హోంమంత్రి అమిత్‌ షా బీహార్‌లో పరిశ్రమల కోసం భూమి లేదని చెప్పిన విషయాన్ని రాహుల్‌ ఎత్తిచూపారు. అదానీకి ఒక రూపాయికే భూమి ఇస్తున్నారు. కానీ బీహార్‌ అభివృద్ధికి మాత్రం భూమి లేదంటున్నారు. ఇది మోసం కాక ఏమిటి? అని ప్రశ్నించారు.

‘రీల్స్‌ కాదు, రియాలిటీ చూడాలి’

మోడీ యువతను రీల్స్‌ చూడమని ప్రోత్సహిస్తున్నారని, ఉద్యోగాల సమస్య నుంచి దృష్టి మళ్లించడానికే ఇది అన్న రాహుల్‌ ఆరోపించారు. మహాఘట్భంధన్‌ అధికారంలోకి వస్తే నలందా విశ్వవిద్యాలయ స్థాయి యూనివర్సిటీని స్థాపిస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌ను అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మూడు కూటముల పోటీ – ఉత్కంఠ భరితం

సాంప్రదాయంగా బీజేపీ బలమైన స్థావరంగా ఉన్న బెగుసరాయ్‌లో ఈసారి మహాఘట్భంధన్‌ తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి అమితా భూషణ్‌ బరిలో ఉన్నారు. భూమిహార్‌ వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి కుందన్‌ కుమార్‌ రీ–ఎంట్రీకి ప్రయత్నిస్తుండగా, జన్‌ సురాజ్‌ ఎంట్రీతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. బీహార్‌ అసెంబ్లీకి మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నాయి.

ధైర్యం లేకుంటే పెద్ద ఛాతీ ఉన్నా వ్యర్థమే:రాహుల్ గాంధీ - Tholi Paluku