Let's talk: editor@tmv.in
ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
23 జులై, 2026

నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ప్రధానమంత్రి నివాసం వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను బర్తరఫ్ చేయకపోతే బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని హెచ్చరించారు.

తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని దింపి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కొడంగల్ వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. వీధుల నుంచి పార్లమెంట్ వరకు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

గాంధీ వారసులు - గాడ్సే వారసుల మధ్య యుద్ధం

బీజేపీ నేతలను "గాడ్సే వారసులు"గా, కాంగ్రెస్ నేతలను "మహాత్మా గాంధీ వారసులు"గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఈ పోరాటం కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదని.. గాంధీ, గాడ్సే వారసుల మధ్య జరుగుతున్న భావజాల యుద్ధమని అన్నారు. నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల నాయకత్వంలో యువత భవిష్యత్తు కోసం మేము వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాడి బీజేపీని ఓడిస్తాం. మోడీ దేశ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం విమర్శించారు. దేశ యువత మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉందని, యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమిస్తుందని ఆయన తెలిపారు.

జులై 20న పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విద్యార్థులపై భద్రతా బలగాలు తీవ్రంగా దాడి చేశాయని, మహిళల దుస్తులు చిరిగిపోయాయని, పురుషులను దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఎంతోమంది విద్యార్థులు కనిపించకుండా పోయారని, వారిని పోలీసులు తీసుకెళ్లారో లేక బీజేపీ నేతలు అపహరించారో తెలియడం లేదన్నారు. జులై 21న ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన ముక్కు నుంచి రక్తం వచ్చిందని, దేశం కోసం రక్తం చిందించిన నెహ్రూ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటి లేదా చివరి వ్యక్తి కాదన్నారు. మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడని, దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీ పదవులను త్యాగం చేసి మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారని సీఎం గుర్తుచేశారు.

కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్కుల మూల్యాంకనంలో కేటీఆర్ 'బెనామీ' కంపెనీ చేసిన అక్రమాల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అదే కంపెనీ పేరు మార్చుకుని, ఢిల్లీలోని బీజేపీ నేతలతో మాట్లాడి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని సీబీఎస్ఈ పేపర్ల మూల్యాంకనం కాంట్రాక్ట్ దక్కించుకుందని విమర్శించారు.

అక్రమాలు జరగడంతో సీబీఎస్ఈ కూడా మూల్యాంకనాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చిందని, ఇది కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆ బెనామీ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నీట్ అక్రమార్కులకు మరింత ధైర్యం వచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో నీట్ ప్రశ్నాపత్రాలను విక్రయించారని సీఎం ఆరోపించారు.