Let's talk: editor@tmv.in
ధర్మస్థల కేసులో ఛార్జ్‌షీట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌: హోంమంత్రి పరమేశ్వర

ధర్మస్థల కేసులో ఛార్జ్‌షీట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌: హోంమంత్రి పరమేశ్వర

Pinjari Chand
21 నవంబర్, 2025

కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా అనేక హత్యలు, అత్యాచారాలు, పాతిపెట్టిన శవాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ అనుమతి లభించినట్లు రాష్ట్ర హెంశాఖ మంత్రి జి. పరమేశ్వర గురువారం స్పష్టం చేశారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మేం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం… సిట్ పని 90 రోజుల గడువులోపే ఛార్జ్‌షీట్ పెట్టాల్సి ఉందని ఆయన వెల్లడించారు. బెల్తంగడీ కోర్టులోనే సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? అని అడిగినప్పుడు మంత్రి స్పందిస్తూ ముందు కోర్టుకు ఛార్జ్‌షీట్ వెళ్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం తెలుసుకుంటుంది. నివేదికలో ఏం రాసి ఉందో అప్పుడే బయటపడుతుందన్నారు. రాబోయే డిసెంబర్ 8న ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తుందా? అనే ప్రశ్నకు ఇప్పటికే ఈ వ్యవహారంపై సభలో చర్చలు జరిగాయి. తాజా విషయాలను హౌస్‌లో ఉంచాల్సిందే అని పేర్కొన్నారు.

రెండు దశాబ్ధాల పాటు సాగిన దారుణం

ఈ వివాదానికి కారణమైన ఫిర్యాదుదారు సి.ఎన్. చినయ్య, తర్వాత తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని అరెస్టయ్యాడు. తాను ఇరవై ఏళ్లలో అనేక శవాలను—మహిళలవి, లైంగిక దాడి గురైన వారి శరీరాలను ధర్మస్థల పరిసరాల్లో పాతిపెట్టానని ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలు స్థానిక దేవాలయ పరిపాలకులపై చేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.

అనేక ప్రదేశాల్లో తవ్వకాలు… బయటపడిన అవశేషాలు

సిట్ ఇప్పటివరకు నేత్రావతి నది ఒడ్డున ఉన్న అడవి ప్రాంతాల్లో, ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన ఐదు కు పైగా ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టినట్టు సమాచారం. ఇక్కడి రెండు ప్రదేశాల్లో అస్థిపంజరాలు వెలికితీయగా, మరికొన్ని ప్రదేశాలలో మానవ అవశేషాల్లా అనిపించే వస్తువులు లభించాయి.వాటిని పునర్విశ్లేషణ కోసం పంపారు. తాజాగా బృందం బంగ్లెగుట్టె అరణ్యంలో, నేత్రావతి స్నాన ఘాట్ పక్కన మరోసారి శోధన జరిపి కొత్తగా అవశేషాలను స్వాధీనం చేసుకుంది. వాటిని బెంగళూరులోని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. నిపుణులు వాటి వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారించేందుకు పరీక్షలు చేపడుతున్నారు.