Let's talk: editor@tmv.in
ధర్మశాల ఘటన అమానుషమైంది: ఎన్సీడబ్ల్యూ

ధర్మశాల ఘటన అమానుషమైంది: ఎన్సీడబ్ల్యూ

Pinjari Chand
4 జనవరి, 2026

ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్, శారీరక వేధింపులు, లైంగిక వేధింపులకు సంబంధించిన అత్యంత తీవ్రమైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఈ ఘటనలో 19 ఏళ్ల మహిళా విద్యార్థిని చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందింది. ఈ దారుణమైన, అమానుషమైన, హేయమైన చర్యను కమిషన్ తీవ్రంగా విమర్శించింది. ఇది విద్యార్థిని జీవన హక్కు, గౌరవం, మౌలిక హక్కులపై ఘోరమైన ఉల్లంఘనగా నిలుస్తోంది. అలాగే విద్యాసంస్థలలో భద్రతా వ్యవస్థలు పూర్తిగా విఫలమైనట్లు ఇది సూచిస్తోందని పేర్కోంది. అలాగే జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ హిమాచల్ ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కు లేఖ రాసినట్లు ఎన్‌సీడబ్ల్యూ తెలిపింది. అందులో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, నిందితులందరినీ అరెస్టు చేయడం, నిష్పక్షపాతంగా, కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయడం, పోస్టుమార్టం నివేదికలు, వైద్య రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యల వివరాలతో కూడిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ (ఏటీఆర్)ను 5 రోజుల్లోగా కమిషన్‌కు సమర్పించాలని హిమాచల్ ప్రదేశ్ అధికారులను ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది.

యూజీసీ సీరియస్

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఒక కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్, వేధింపులు, లైంగిక వేధింపులకు గురై, చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు విద్యార్థులు, ఒక ప్రొఫెసర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో విద్యాసంస్థ స్థాయిలో జరిగిన లోపాలపై విచారణ చేపట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల దళిత యువతి మృతి చెందిన ఘటనపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీవ్రంగా స్పందించింది. దీర్ఘకాలంగా ర్యాగింగ్, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నేపథ్యంలో విద్యార్థిని మృతి చెందినట్టు ఆరోపణలు రావడంతో యూజీసీ ఈ ఘటనను సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. మీడియా కథనాల ఆధారంగా యూజీసీ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ ఒక ఫిర్యాదును నమోదు చేసింది. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం ఇది ఆత్మహత్య కేసు కాదని, కేవలం సహజ మరణంగానే పరిగణించాలని పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని యూజీసీ తెలిపింది. అదే సమయంలో ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ర్యాగింగ్, లైంగిక వేధింపుల ఆరోపణలు సహా అన్ని అంశాలను పరిశీలించేందుకు యూజీసీ ఒక ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

కఠిన చర్యలు తీసుకుంటాం

విద్యార్థుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని యూజీసీ స్పష్టం చేసింది. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అశ్వని కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది హిమాచల్‌లోని ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటి. ఈ ఘటన కళాశాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ కళాశాల అనేక మంది ప్రముఖులను తయారు చేసింది. నేనూ ఇదే కళాశాలలో చదివాను. బాధిత విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు.

ఇదిలా ఉండగా బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, 2025 సెప్టెంబర్ 18న ముగ్గురు మహిళా విద్యార్థులు తన కుమార్తెపై దాడి చేసి బెదిరించారని, అలాగే ఒక ప్రొఫెసర్ ఆమెను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఘటనల కారణంగా విద్యార్థిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైందని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం, డిసెంబర్ 26, 2025న లుధియానాలోని డీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో నలుగురు నిందితులపై

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 75, 115(2), 3(5), హిమాచల్ ప్రదేశ్ విద్యాసంస్థలు (ర్యాగింగ్ నిషేధం) చట్టం, 2009 – సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ స్పందన

ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల ద్వితీయ సంవత్సరం దళిత విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు దీర్ఘకాల ర్యాగింగ్, లైంగిక వేధింపులే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది.

ఈ విషయమై మీడియాతో హిమాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విద్యా నేగి మాట్లాడుతూ మేం ఈ ఘటనను పరిగణనలోకి తీసుకున్నాం. ఎస్పీని పిలిపించి, రాతపూర్వక నివేదిక ఇవ్వాలని కోరాం. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా దర్యాప్తు చేయాలని సూచించాం. ఎవరైనా దోషులుగా తేలితే వారికి శిక్ష పడాలి. సమగ్ర విచారణ జరగాలి. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కూడా సున్నితంగా స్పందిస్తోంది అని ఆమె చెప్పారు.