
ధరణి అక్రమాలపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్
ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంపై నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించబడిన లోపాల ఫలితమేనని ఆయన పేర్కొన్నారు.
బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం అందుబాటులో లేకుండా చేయబడినట్టు విచారణలో గుర్తించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినప్పటికీ, పోర్టల్‌కు సంబంధించిన కోడ్ ఆడిట్ చేపట్టకపోవడం తీవ్రమైన లోపమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌పై తక్షణమే సమగ్ర కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ అయిన టెర్రాసిస్ కు అప్పగించడం వల్ల పలు సాంకేతిక, పరిపాలనా సమస్యలు తలెత్తినట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. పోర్టల్‌లో ఉన్న లోపాలను దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యంతో తీసుకుంటున్నామని, తప్పు చేసిన వారు ఎవ్వరైనా సరే వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టపోయిన ప్రతి పైసాను తిరిగి వసూలు చేయడం లక్ష్యంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలోనే మిగతా జిల్లాల్లో కూడా విచారణ చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూ లావాదేవీలలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక పరమైన భద్రతా చర్యలు బలోపేతం చేయాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, సీఎంఆర్వో మందా మకరంద్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు, పోలీసు, సైబర్ క్రైమ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని, బాధ్యులపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
