Let's talk: editor@tmv.in
ధన త్రయోదశి అంటే … బంగారం కొనాలా?

ధన త్రయోదశి అంటే … బంగారం కొనాలా?

Dantu Vijaya Lakshmi Prasanna
17 అక్టోబర్, 2025

మహిళలు ధనలక్ష్మీ వరసిద్ధి కోసం ధన త్రయోదశి నాడు స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తే... వ్యాపారస్తులు ఇదే పర్వదినాన తమ నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. కొన్నిచోట్ల ఇదే రోజు కుబేరుడిని పూజించడం ఆనవాయితీ అయితే... మరి కొన్ని చోట్ల అపమృత్యు నివారణ కోసం దీపాలను వెలిగించడం సంప్రదాయం. ఏదేమైనా, దీపావళి పండగలో భాగంగా ఐదు రోజులు జరుపుకొనే వేడుకల్లో తొలి రోజైన 'ధన త్రయోదశి ' ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

**ఇదే ‘ధన’ త్రయోదశి!

ఉత్తరాదిలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ 'ధన్‌తేరస్'నే 'ధన త్రయోదశి' అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో దీపావళి పర్వదినాల్లో భాగంగా తొలి రోజు జరుపుకొనే ఈ పండగ సందర్భంగా ప్రజలంతా స్వర్ణాభరణాల కొనుగోలుపై మొగ్గు చూపడం విశేషం. కొత్త వస్తువులు కొనడానికి ఇది అనువైన రోజని పండితులు చెబుతుంటారు. భక్తుల కోరికలను తీర్చడానికి 'అదృష్ట లక్ష్మి' తనను పూజించే ప్రతి ఇంటికీ ఈ రోజు అతిథిగా విచ్చేస్తుందన్నది ఒక నమ్మకం.

ధన త్రయోదశికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రోజున హిమచక్రవర్తి కుమారుడు పాముకాటుకి గురవుతాడని, అతడి జాతకం ద్వారా ముందే తెలిసిందట. దీంతో తన పతిని కాపాడుకోవడం కోసం అతని భార్య ఆ సమయంలో ఇంట్లోని వెండి, బంగారు ఆభరణాలన్నీ తెచ్చి గడప ముందు రాశులుగా పోసిందని, ఆ రాశుల నుంచి వచ్చే తేజస్సు ధాటికి తట్టుకోలేక పాము రూపంలో ఆమె భర్త ప్రాణాలు కబళించడానికి వచ్చిన యమధర్మరాజు తిరిగి వెళ్లిపోయాడని ఓ కథ ప్రచారంలో ఉంది. ధనత్రయోదశినే కొన్ని ప్రాంతాల్లో 'యమ త్రయోదశి' అని కూడా పిలుస్తారు. ఈ రోజున సాయంత్రం భక్తులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ పూజలో భాగంగా గోధుమ, పెసలు, మినుములు, కందులు, బార్లీ .. మొదలైన వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే అపమృత్యు నివారణ కోసం నూనెతో దీపం వెలిగిస్తారు. దీనినే 'యమదీపం' అని కూడా అంటారు.

ధన్వంతరి ఆవిర్భావం*:

ఆరోగ్యం, ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి, ఆ మహాభాగ్యానికి అవసరమైన ఔషధాల దాత ధన్వంతరి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఆయన ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి వచ్చాడు. అందుకే అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కోసం ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి శ్రీమన్నారాయణుని అంశ అని, ఆయన్ని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించే ముందు ధన్వంతరిని స్మరించుకుంటారు. ఏది ఏమైనా భారతీయుల సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే బంగారం కొనాల్సిందే అని కొందరి అభిప్రాయం.

‘బంగారం’ పండగ

ధన త్రయోదశి సందర్భంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొనే అంశం కొత్త స్వర్ణాభరణాలను, వస్తువులను కొనుగోలు చేయడం.ఈ రోజున బంగారం కొనుగోలు చేసి ఆ మహాలక్ష్మికి సమర్పిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో కళకళలాడుతుంటారని భావిస్తారు. ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అష్త్టెశ్వర్యాల సిద్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో కుబేరుడిని పూజించడం కూడా ఒక ఆచారంగా ఉంది.

ధన త్రయోదశి సందర్భంగా కుంకుమతో చేసిన పాదాలను, రంగురంగుల రంగవల్లికలను.. ఇంటి గడప ఎదుట వేసి ఆ మహాలక్ష్మికి స్వాగతం పలికే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇదే రోజు ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే, ఆమెలో ఆ లక్ష్మీదేవి అంశ తప్పకుండా ఉంటుందని, తమ ఇల్లు పావనమవుతుందని చాలామంది నమ్మడం విశేషం. ధన త్రయోదశి రోజునే కొన్ని ప్రాంతాల్లో 'ధన్వంతరి జయంతి'ని జరుపుకొనే సంప్రదాయం కూడా ఉంది. కొత్త ఒప్పందాలు చేసుకోవాలన్నా, నూతన వ్యాపార లావాదేవీలకు శ్రీకారం చుట్టాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా 'ధన్‌తేరస్' అనువైన రోజని మార్వాడీలు భావిస్తారు. ధన త్రయోదశి రోజునే పితృదేవతలను స్మరిస్తూ, సంధ్యా సమయంలో దక్షిణ దిక్కుగా దీపాన్ని వెలిగించి, వారికి నైవేద్యం సమర్పించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. ఇదే రోజున గోవులను పూజించే సంప్రదాయం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉండడం విశేషం.

ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని చాలా మంది బలంగా నమ్ముతారు. అందుకే ఆ పవిత్రమైన రోజున కనీసం ఒక్క గ్రాము బంగారాన్ని అయినా కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. పండుగ సందర్భంగా ఉండే అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అమ్మకాలను పెంచుకోవడానికి ఆభరణాల వ్యాపారులు బంగారంపై అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తారు. ఈ ఆఫర్లతో చాలా మంది ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తారు. అయితే, బంగారాన్ని కేవలం నగలు లేదా ఆభరణాల రూపంలోనే కాకుండా, డిజిటల్‌గానూ, బాండ్ల రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. మరి పెరుగుతున్న పసిడిని కొనాలో వద్దో ఆలోచించండి..

ధన త్రయోదశి అంటే … బంగారం కొనాలా? - Tholi Paluku