Let's talk: editor@tmv.in
ధన్​ఖడ్ నిష్క్రమణపై రాజ్యసభలో రచ్చ

ధన్​ఖడ్ నిష్క్రమణపై రాజ్యసభలో రచ్చ

Pinjari Chand
2 డిసెంబర్, 2025

శీతకాలంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటిరోజే రాజ్యసభలో ధన్ ఖడ్ అంశంపై రగడ మొదలైంది. ఖర్గే ఆ అంశంపై బాధపడుతూనే ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రభుత్వం కూడా అంతే దీటుగా స్పందించింది. రాజ్యసభలో ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సోమవారం కొత్త చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను ఆయన మొదటి రోజు సభా కార్యకలాపాలను నడిపిన సందర్భంగా స్వాగతిస్తూ.. మునుపటి చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా, అనూహ్యంగా నిష్క్రమించడాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార సభ్యుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన సంక్షిప్త ప్రసంగంలో ఖర్గే, చైర్మన్ ఇరు పక్షాల మధ్య సమతూకాన్ని కాపాడాలని, ప్రతిపక్ష సభ్యులకు కూడా తమ సమస్యలను లేవనెత్తే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే రాధాకృష్ణన్ కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని, ఆయన మామ కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉండేవారని, తర్వాత ఆ స్థానాన్ని ఆయనే అధిష్ఠించారని గుర్తు చేశారు.

ధన్ ఖడ్ అనుహ్యంగా వైదోలగడం చాలా బాధ పెట్టింది

వింటర్ సెషన్ ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రకటనను కూడా ఖర్గే ప్రస్తావిస్తూ దానికి తాము తర్వాత స్పందిస్తామని చెప్పారు. సభా కార్యకలాపాల్లో తమ పార్టీ సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఖర్గే ఇలా అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ విలువలతోపాటు పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల స్థిరంగా నిలబడుతుంది. సభా కార్యకలాపాల్లో మా నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నాను.

అయితే ఆ తర్వాత న్యాయమైన, నిష్పాక్షపాత ధోరణితో సభ నడపడం, ప్రతి పార్టీ సభ్యులకు సమాన అవకాశం కల్పించడం. ఈ పదవి గౌరవానికి అత్యవసరం. ఆరోగ్య కారణాలతో జులై 21న ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతిని ‘ఆకస్మిక నిష్క్రమణ’గా పేర్కొన్నారు. పార్లమెంటరీ చరిత్రలో ఇంత అనూహ్యంగా, ఆకస్మికంగా చైర్మన్ పదవి నుంచి వైదోలగడం చాలా అరుదు. ఆయనకు సభలో వీడ్కోలు చెప్పే అవకాశం కూడా మాకు దక్కలేదు, అది నన్ను చాలా బాధపెట్టింది. ఈ మాటలతోనే అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళన వ్యక్తమైంది.

అలాగే రాధాకృష్ణన్ మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న మాజీ కాంగ్రెస్ ఎంపీ సి.కె. కుప్పుస్వామితో సంబంధం ఉన్న వ్యక్తని కూడా ఖర్గే గుర్తు చేశారు. ఇరు పక్షాల మధ్య సమతూకం కాపాడితే మంచిది. మీకు సఫలమైన పదవీకాలం కోరుకుంటున్నాను. ప్రధాని మీ నేపథ్యాన్ని ప్రస్తావించారు కానీ మీరు కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తననే విషయాన్ని కూడా మరచిపోకూడదు అని అన్నారు. రెండవది పార్లమెంట్ బయట ప్రధాని ఒక ప్రకటన ఇచ్చారు. మాపై పరోక్షంగా దాడి చేశారు. దానికి ఇక్కడే సమాధానం ఇస్తామన్నారు.

మాజీ చైర్మన్ విషయం ఎందుకు తీసుకొచ్చారు?

ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ అత్యంత పవిత్రమైన సందర్భంలో మాజీ చైర్మన్ రాజీనామా విషయాన్ని ఎందుకు లేవనెత్తారు? అంటూ ఖర్గేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది చాలా పవిత్ర సందర్భం ప్రధాని అత్యంత గౌరవంగా మాట్లాడారు. అనవసరంగా ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. మాజీ చైర్మన్‌ను అవమానించిన తీరు, మీరు ఇచ్చిన ఇంపీచ్‌మెంట్ నోటీసు… ఆ కాపీ ఇంకా మా దగ్గరే ఉంది అని రిజిజు గుర్తు చేశారు.

మీరు రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు..గుర్తులేదా?

సభా నాయకుడు జేపీ నడ్డా కూడా జోక్యం చేసుకుంటూ ఈ సందర్భం గౌరవాన్ని కాపాడాలని కోరారు. సంబంధం లేని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి (కాంగ్రెస్‌తో సహా) ఓటమిని కూడా ఈ సందర్భంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అత్యంత పవిత్రమైనది. దీని గౌరవాన్ని కాపాడాలి. ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన విషయం దానిపై చర్చిస్తే అది ఉపయోగం లేనిది. మీరు రెండు సార్లు ఆయనపై అవిశ్వాస తీర్మానం తెచ్చారని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది మంచి, సౌహార్ద వాతావరణానికి అడ్డంకి అని నడ్డా అన్నారు. ప్రధాని బయట చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నారు. బిహార్, హర్యానాల్లో ఓటమి మీకు చాలా బాధ కలిగించి ఉంటుంది. ఆ బాధను డాక్టర్ దగ్గర చెప్పుకోండి అని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ లో డ్రామాలొద్దు

వింటర్ సెషన్ మొదటి రోజున మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ బీహార్‌లో ఓడిపోయిన బాధతో ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. ఓటమి కారణంగా పార్లమెంట్ లో గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదు. గెలుపు అహంకారంగా మారకూడదు అని అన్నారు. పార్లమెంట్ డ్రామాలకు కాదు, ఫలితాలు సాధించే చోటు. ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్టేషన్‌ను ఇక్కడ వెళ్లగక్కడం సరికాదని మోడీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ కు స్వాగతం పలికారు.