Let's talk: editor@tmv.in
ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో రాష్ట్ర మంత్రి డా. వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్య మరింత చురుగ్గా పనిచేయాలని, ఇంటింటి ప్రచారాన్ని బలోపేతం చేయాలని అభ్యర్థులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును విస్తృతంగా తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి, త్యాగాలు చేసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో భారీగా కమిషన్లు దండుకుని, తమ సొంత, పార్టీ ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారని మంత్రి విమర్శించారు.

కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఆకాశమంత ఎత్తుకు పెరిగాయని, బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో సుమారు 800 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే, మేఘా కృష్ణా రెడ్డి నుంచి 400 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు అందాయని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, అప్పటి సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు నిర్మించుకున్నారని మంత్రి అన్నారు.

బీఆర్ఎస్ నేత కవిత చేస్తున్న ఆరోపణలను ఎవరూ ఖండించలేకపోతున్నారని, అవి నిజాలే కాబట్టే ఎవరూ తిప్పికొట్టడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంపన్న రాష్ట్రాన్ని సుమారు 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని, ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం వడ్డీ చెల్లింపులకు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని వివరించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మెల్ల మెల్లగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఆయన వివరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఇప్పటివరకు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, దీని వల్ల మహిళలు నెలకు సుమారు 3 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం అందించేందుకు 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 23 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి, వడ్డీ లేని రుణాలు చెల్లించామని మంత్రి వెల్లడించారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు బలంగా ఉందని, మెదక్ మున్సిపాలిటీలో 90 శాతం పైగా స్థానాలు గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అయితే అభ్యర్థులు ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోకుండా, కష్టపడి ప్రజల వద్దకు వెళ్లి పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని మంత్రి సూచించారు.