Let's talk: editor@tmv.in
ధనవంతుల ‘స్పెషల్ పూజలు’ దేవుడి విశ్రాంతిని భంగం చేస్తున్నాయి: సుప్రీంకోర్టు

ధనవంతుల ‘స్పెషల్ పూజలు’ దేవుడి విశ్రాంతిని భంగం చేస్తున్నాయి: సుప్రీంకోర్టు

Pinjari Chand
16 డిసెంబర్, 2025

డబ్బు చెల్లించే ధనవంతుల కోసం ఆలయాల్లో నిర్వహిస్తున్న ‘స్పెషల్ పూజలు’ దేవుడి విశ్రాంతి సమయాన్ని భంగం చేస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసిన తర్వాత దేవుడికి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి ఇవ్వడం లేదు. ఆ సమయంలోనే ఎక్కువగా దేవుడిపై ఆధారప డుతున్నారు. భారీగా డబ్బు చెల్లించగలిగే ధనవంతులందరికీ ప్రత్యేక పూజలు చేయిస్తున్నారని వాపోయింది. వృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ జీ ఆలయంలో దర్శన సమయాల మార్పు, సంప్రదాయ పూజా విధానాల్లో జోక్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చీ, విపుల్ ఎం పాంచోలీలతో కూడిన ధర్మాసనం, సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ ఆలయ నిర్వహణ కమిటీకి, అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. బాంకే బిహారీ ఆలయంలో దర్శన సమయాలు శతాబ్దాల సంప్రదాయానికి భాగమని, ఇటీవల చేసిన మార్పులు దేవుడు లేవడం–నిద్రించే సమయాలను కూడా మార్చేశాయని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు.

దేవుడిని దోపిడీ చేయడంలాంటిదే

మధ్యాహ్నం ఆలయం మూసిన తర్వాత దేవుడికి క్షణం కూడా విశ్రాంతి ఇవ్వకుండా, డబ్బు చెల్లించే ధనవంతులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇది దేవుడిని దోపీడి చేయడం లాంటిదేనని సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన దివాన్, దేవుడి విశ్రాంతి సమయం అత్యంత పవిత్రమైనది. ఆ సమయంలో ఎలాంటి పూజలు జరగకూడదని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోస్వామీల చేత నిర్వహించే దేహ్రీ పూజను నిలిపివేయడం సంప్రదాయాలకు విరుద్ధమని వాదించారు. ఈ పూజ ప్రజలకు దర్శనం లేని సమయంలో, పరిమిత ప్రదేశంలో జరిగేదని, కాబట్టి గుంపుల నియంత్రణ పేరుతో దాన్ని రద్దు చేయడం సరికాదన్నారు.

ఈ వివాదానికి నేపథ్యంగా,

1939 నుంచి అమల్లో ఉన్న ఆలయ నిర్వహణ పథకాన్ని రద్దు చేసి, ఉత్తరప్రదేశ్ శ్రీ బాంకే బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్–2025 ద్వారా ప్రభుత్వ ఆధీనంలోని ట్రస్ట్ ఏర్పాటు చేయడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆగస్టు 2025లో సుప్రీంకోర్టు ఈ ఆర్డినెన్స్ అమలును నిలిపివేసి, దాని చెల్లుబాటును నిర్ణయించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టుకు వదిలేసింది. అలాగే, రోజువారీ ఆలయ నిర్వహణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, షెల్టర్లు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు, సమూహ నియంత్రణ మార్గాలు వంటి వసతులు కల్పించే బాధ్యతను కూడా వహిస్తోంది.

భార్యభర్తలు వేర్వేరుగా జీవించడం క్రూరత్వంతో సమానం

భార్యాభర్తలు చాలా కాలం పాటు వేర్వేరుగా జీవించడం, ఇక ఇద్దరికీ కలిసే అవకాశం లేకపోవడం క్రూరత్వంతో సమానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కాగితాల మీదే వివాహ బంధాన్ని కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. ఆగస్టు 4, 2000న పెళ్లి అయిన ఈ జంట 2003లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గత 24 ఏళ్లుగా వేరు వేరుగా జీవిస్తున్నారు. కోర్టులు పలు సార్లు సర్దుబాటు ప్రయత్నాలు చేసినప్పటికీ, కలవడం సాధ్యపడలేదని ధర్మాసనం గమనించింది. న్యాయమూర్తులు మన్మోహన్, జాయ్మల్య బాగ్చి‌ల ధర్మాసనం దీర్ఘకాలంగా ఏర్పాటు కొనసాగితే, అది ఇద్దరికీ మానసిక క్రూరత్వంగా మారుతుంది. దీర్ఘకాలం నడిచే వివాహ కేసులు కేవలం కాగితాల మీద వివాహాన్నే కొనసాగిస్తాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాల్లో బంధాన్ని విరమించడమే వ్యక్తులకు, సమాజానికి మేలు అని సూచించింది.

ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి, ఈ వివాహం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొంటూ సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. షిల్లాంగ్‌కు చెందిన ఈ జంట విషయంలో అదనపు డిప్యూటీ కమిషనర్ (జ్యుడీషియల్) ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను కోర్టు సమర్థించి, వివాహాన్ని పునరుద్ధరించిన హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసింది. ఇద్దరూ తమ తమ దృక్కోణాలను గట్టిగా పట్టుకుని, పరస్పరం సర్దుబాటు చేసుకోకపోవడమే ఒకరికొకరు క్రూరత్వంగా మారిందని కోర్టు పేర్కొంది. ఎవరి దృక్కోణం సరైందో నిర్ణయించడం కోర్టు పని కాదని, వారి మధ్య మనస్పర్ధలే సమస్య అని స్పష్టం చేసింది. ఈ దంపతులకు పిల్లలు లేరని, అందువల్ల విడాకులు మూడో వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపవని కోర్టు గమనించింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహాన్ని కాపాడాలనే ప్రయత్నం మానసిక వేదనకే దారి తీస్తుందని తేల్చింది.