Let's talk: editor@tmv.in
ద్రోణి ప్రభావం..రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

ద్రోణి ప్రభావం..రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

Panthagani Anusha
16 మార్చి, 2026

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి దిశ నుంచి వీచే గాలుల కారణంగా నేటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అదే సమయంలో అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆకస్మికంగా కురిసే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ప్రజలకు హెచ్చరించారు. అవసరమైతే స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరారు.