Let's talk: editor@tmv.in
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్‌

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్‌

Shaik Mohammad Shaffee
1 జనవరి, 2026

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం ఆలయం సమీపంలో శివలింగం ధ్వంసం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఆలయ కోనేరు సమీపంలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనలో సీలం శ్రీనివాస్ (38) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది?

రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శ్రీనివాస్, ఆలయ కోనేరు దగ్గర ఉన్న శివలింగాన్ని సుత్తితో కొట్టి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనంపై అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సిసిటివి కెమెరాల ఆధారంగా గాలించిన పోలీసులు, నిందితుడిని తన ఇంట్లోనే పట్టుకున్నారు.

వ్యక్తిగత కక్షలే కారణమా?

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నిందితుడు శ్రీనివాస్ శివుడికి పరమ భక్తుడు. అయితే, ఆలయ పూజారి సూరిబాబుకు, శ్రీనివాస్‌కు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆలయ పూజారి నిర్వహించిన హోమం, రోడ్డు తవ్వకం, పైప్‌లైన్ ఏర్పాటు, కాలువ నిర్మాణం కారణంగా నిందితుడి ఇంటి ముందు మురుగునీరు ప్రవహించడంతో గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు.

ఈ విషయం మీద ఆగ్రహంతో ఉన్న శ్రీనివాస్ ముందుగా కాలువను ధ్వంసం చేశాడని, అనంతరం ఆలయ ప్రాంగణంలో కోనేరుకు సమీపంలో పూజారి శివలింగానికి పూజ చేస్తుండటాన్ని గమనించి, ఆయన పూజలు చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో శివలింగాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు చెప్పారు. పూజారికి హాని చేయాలనే దురుద్దేశం కూడా నిందితుడిలో ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 298, 324(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యమంత్రి సీరియస్

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ముఖ్యమంత్రికి వివరించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి పనులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు.

బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ఆనం

ద్రాక్షారామంలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు . ఈ చర్య భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, ఘటనపై జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో సమీక్షించారు. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ క్షేత్రంలో ఇలా జరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీస్, దేవాదాయ శాఖల సమన్వయంతో ఆలయాల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.