Let's talk: editor@tmv.in
దోహాలో సురుచి ‘బంగారు’ గురి.. సైన్యం సిల్వర్ మెరుపులు

దోహాలో సురుచి ‘బంగారు’ గురి.. సైన్యం సిల్వర్ మెరుపులు

Pinjari Chand
7 డిసెంబర్, 2025

19 ఏళ్ల హర్యానా అమ్మాయి సురుచి సింగ్ 245.1 స్కోరుతో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బంగారు పతకం సాధించగా, పంజాబ్ యువతి సైన్యం శర్మ 243.3తో సిల్వర్ సొంతం చేసుకుని సీజన్ ముగింపు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌కు అరుదైన 1-2 ఫినిష్ అందించారు. ఒలింపిక్ డబుల్ బ్రాంజ్ విన్నర్ మాను భాకర్‌ను వెనక్కి నెట్టి, ఈ ఇద్దరు టీనేజ్ షూటర్లు ప్రపంచ షూటింగ్‌కు మంచి రోజులు రానున్నాయని చాటి చెప్పారు.

సీజన్ ముగింపు ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ మొదటి రోజున భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సురుచి సింగ్ బంగారు పతకం సాధించగా, మరో షూటర్ సైన్యం వెండి పతకం సొంతం చేసుకుని 1-2 ఫినిష్ అందించారు. సురుచి ఫైనల్‌లో 245.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. సైన్యం 243.3తో రెండో స్థానంలో నిలవగా, ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ 179.2తో ఐదో స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది వరుసగా నాలుగు వరల్డ్ కప్ బంగారు పతకాలతో సెప్టెంబర్-అక్టోబర్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచిన సురుచి, క్వాలిఫికేషన్‌లో 586తో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మను భాకర్ 578తో ఆరో స్థానం, 2023 జూనియర్ వరల్డ్ ఛాంపియన్ సైన్యం 573తో ఎనిమిదో స్థానంలో నిలిచి క్వాలిఫై అయింది. ఫైనల్‌లో మాత్రం 21 ఏళ్ల సైన్యం ఎక్కువ సమయం రెండు ఆధిక్యంలో ఉన్నా, ఎలిమినేషన్ దశలో వరుసగా నాలుగు 9.5 స్కోర్లతో సురుచికి బంగారు అవకాశం ఇచ్చింది. ఝజ్జర్ జిల్లాకు చెందిన హవిల్దార్ కుమార్తె సురుచి €5,000(రూ.4,77,500), సైన్యం €4,000(రూ.3,82,000) నగదు బహుమతి అందుకున్నారు.

పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్‌లో నిరాశ

2022 వరల్డ్ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్ నాలుగో స్థానం (209.9), పారిస్ ఒలింపిక్ ఫైనలిస్ట్ అర్జున్ బబూతా ఆరో స్థానంలో నిలిచి పతకాలు కోల్పోయారు. స్వీడన్‌కు చెందిన విక్టర్ లిండ్‌గ్రెన్ (253.0) బంగారు, చైనా షెంగ్ లీహావో (252.6) సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. మహిళల 10మీ ఎయిర్ రైఫిల్‌లో ఈజిప్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ కాంస్య విజేత ఎలవెనిల్ వలరివాన్ క్వాలిఫికేషన్‌లోనే 630తో 9వ స్థానంతో ఫైనల్‌కు చేరలేకపోయింది. ట్రాప్‌లో భారత ఏకైక ప్రతినిధి జోరావర్ సింగ్ సంధు మొదటి రోజు 70/75తో 9వ స్థానంలో ఉన్నాడు. ఆదివారం మిగతా రెండు రౌండ్ల అనంతరం టాప్-6 ఫైనలిస్టులను నిర్ణయిస్తారు. భారత షూటింగ్ అభిమానులకు సురుచి-సైన్యం ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో తెచ్చే మరిన్ని పతకాలపై ఆశలు రేకెత్తించారు.

దోహాలో సురుచి ‘బంగారు’ గురి.. సైన్యం సిల్వర్ మెరుపులు - Tholi Paluku