
దొనకొండలో కాంగ్రెస్ ఉచిత మెడికల్ క్యాంప్: 232 మందికి వైద్య సహాయం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల విభాగం చైర్మన్, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. దొనకొండ మండల కేంద్రంలోని రైల్వే కమ్యూనిటీ హాల్‌లో మార్కాపురం కందుల ఓబుల్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుంటుందని భవిష్యత్తులో జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తామని వారు వెల్లడించారు. కాగా ఈ శిబిరంలో సుమారు 232 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చైర్మన్ బొడ్డు సతీష్, మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.
