
దొంగతనం జరిగిన గంటల్లోనే కేసు ఛేదన
కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద చోటుచేసుకున్న భారీ బంగారం దొంగతనం కేసును స్థానిక పోలీసులు వేగంగా సుమారు 12 నుంచి 18 గంటల లోపు ఛేదించి రూ.60 లక్షల విలువగల 624 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన అంబూరి ముని కృష్ణ విజయనగరం నుంచి తిరుపతికి వెళ్తూ ఒక ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దొంగతనం జరిగింది. గండేపల్లి సమీపంలోని ఓ ధాబాలో భోజన విరామం కోసం బస్సు ఆగినప్పుడు ఆయన బస్సులోనే తన బ్యాగ్‌లో ఉన్న బంగారాన్ని వదిలి వెళ్లారు. భోజనం అనంతరం తిరిగి బస్సులోకి ఎక్కే సమయానికి బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న కాకినాడ జిల్లా పోలీసులు వేగంగా స్పందించి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో పోలీసులు దర్యాప్తు జరిపి విజయనగరం జిల్లాకు చెందిన పాత నేరస్తులు టి. నరసింహ, పి. తేజ, మహేందర్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు విషయమై డీజీపీ హరిశ్ కుమార్ గుప్తా( ఐపీఎస్) స్పందిస్తూ, కాకినాడ పోలీసులు ప్రదర్శించిన చాకచక్యం, నిబద్ధత ప్రశంసనీయమైనది. ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత బలపడే విధంగా ఉంది అంటూ దర్యాప్తు అధికారులను ప్రశంసించారు. అదేవిధంగా ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “మా బృందం పగలు రాత్రి కష్టపడి, ఆధునిక సాంకేతికతతోపాటు సంప్రదాయ విచారణా పద్ధతులను ఉపయోగించి. అతి తక్కువ సమయంలోనే తిరిగి దొంగతనం జరిగిన బంగారం తిరిగి స్వాధీనం చేయగలిగాం, ప్రజల ఆస్తులను రక్షించడం పోలీసుల కర్తవ్యం” అని వివరించారు.
ఇక స్వాధీనం చేసుకున్న బంగారంలో గొలుసులు, వంకీలు, ఉంగరాలు,ఇతర బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను యజమానులకు తిరిగి అందజేశామని అదేవిధంగా . అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగారం దొంగతన నెట్‌వర్క్‌లో భాగమై ఉన్నారా అన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై సామాజిక మాధ్యమాల్లో కాకినాడ పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. స్థానికులు పోలీసులు చూపిన వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన దర్యాప్తును మెచ్చుకుంటూ తమ అభినందనలు తెలియజేస్తున్నారు.
