
దేశ రాజధానిలో హై అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఆధ్యాత్మిక, వారసత్వ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్ర ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఎర్రకోట పరిసరాలు, చాందినీ చౌక్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేపట్టారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తయిబా భారత్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర గూఢచారి సంస్థలు హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా చాంద్నీ చౌక్ పరిసరాల్లోని ఒక దేవాలయం లక్ష్యంగా ఉండొచ్చని సమాచారం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఐఈడీ ఆధారిత దాడికి ప్రయత్నం జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుట్ర ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లో మసీదు వద్ద జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఉండొచ్చని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ఈ సమాచారాన్ని అధికారులు ధృవీకరిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి భయం అవసరం లేదని, ఇది కేవలం జాగ్రత్త చర్యలేనని స్పష్టం చేశారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెంపు, వాహనాల సోదాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, క్విక్ రియాక్షన్ టీమ్‌లను సిద్ధంగా ఉంచేందుకు కేంద్ర సంస్థలు, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో 13 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరికను అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఇంటెలిజెన్స్ సమాచారంపై మరిన్ని వివరాల సేకరణ, పరిశీలన కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.
