
దేశ భవిష్యత్ అమ్మాయిలదే: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
మన దేశ, సమాజ భవిష్యత్తు మన అమ్మాయిల చేతుల్లోనే ఉందని, మీరు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. బుధవారం శారదీయ నవరాత్రులలో భాగంగా నవమి రోజు షాలిమార్ బాగ్లోని హైదర్ పూర్ ఉన్న బాలికల ప్రభుత్వ పాఠశాలలో కన్యాపూజ నిర్వహించారు. ఈ సందంర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మన దేశంలో బాలికలలో 'మా' (భగవతి) ప్రతిరూపాన్ని చూస్తామన్నారు. మనం అనేక సంవత్సరాలుగా కన్యా పూజను జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.
ఛాత్ పూజను ఘనంగా నిర్వహిస్తాం
ఈ సంవత్సరం ఢిల్లీలో ఛాత్ పూజను ఘనంగా నిర్వహిస్తామని, యమునా నదికి ఇరువైపులా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేఖాగుప్తా తెలిపారు. ప్రణాళిక బద్దంగా ఛాత్ పూజ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చరిత్రలో గుర్తుండిపోయేలా నది ఒడ్డున పనులు చేయిస్తామన్నారు. అలాగే అక్కడ పరిసరాల పరిశుభ్రతపై కూడా ముఖ్యంగా దృష్టి సారిస్తున్నామని ఈ ఏడాది ఛాత్ పూజలు వైభవంగా నిర్వహిస్తామన్నారు.
దుర్గాపూజలో పాల్గొన్న ప్రధాని
ఢిల్లిలో మినీ బెంగాల్ గా పిలిచే చిత్తరంజన్ పార్క్ దుర్గాపూజ ఉత్సవాలకు ప్రసిద్ధి.ఇక్కడ పండళ్లు(మండపాలు), ఆహార దుకాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి వేలాదిమంది తరలివస్తారు. మంగళవారం మహా అష్టమి సందర్భంగా ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ లో జరిగిన దుర్గా పూజ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కాళీ బారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం దుర్గా పూజ సహకార సంఘం కాళీ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపాన్ని సందర్శించారు. ప్రధానితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా ఉన్నారు.
