Let's talk: editor@tmv.in
దేశ భవిష్యత్తుకు బాలికలే పునాది: ఎమ్మెల్యే ధన్‌పాల్

దేశ భవిష్యత్తుకు బాలికలే పునాది: ఎమ్మెల్యే ధన్‌పాల్

Gaddamidi Naveen
25 జనవరి, 2026

జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో నిర్వహించిన ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికల విద్య, భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే వికసిత భారత్ దిశగా దేశం తీసుకుంటున్న ప్రధాన సంకల్పమని తెలిపారు. దేశ భవిష్యత్తుకు బాలికలే పునాదని, వారి విద్యాాభివృద్ధి, సామాజిక అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

బాలికలు చదువుతో పాటు జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై దృష్టి సారించి, బాలికలను సమానంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా బేటీ బచావో – బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, పీఎం పోషణ్ పథకం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, జాతీయ బాలికల విద్య ప్రోత్సాహక పథకం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆయన వివరించారు. ఈ పథకాలు బాలికల విద్యను ప్రోత్సహించడమే కాకుండా, ఆరోగ్యం, పోషణ, ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

ప్రతి అర్హుడైన కుటుంబం ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దేశ భవిష్యత్తుకు బాలికలే పునాది: ఎమ్మెల్యే ధన్‌పాల్ - Tholi Paluku