
దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు:పవన్ కళ్యాణ్
యువత ఏ ఒక్క సిద్ధాంతాన్ని లేదా భావజాలాన్ని గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి అంశాన్ని వాస్తవిక కోణంలో లాజిక్ తో ఆలోచించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మెగా కల్చరల్ ఫెస్ట్' ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది.
ఆలోచించండి.. ఆపై ఆచరించండి
యువత భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఎవరో ఒకరు చెప్పిన ఐడియాలజీకి ప్రభావితం కావొద్దు. అది కారల్ మార్క్స్ అయినా నేనైనా సరే. వారు చెప్పిన సిద్ధాంతం ప్రస్తుత కాలానికి సరిపోతుందో లేదో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. గతంలో సమతుల్యత లేని భావజాలాలను నమ్మి ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోయారు. మనం నమ్మే సిద్ధాంతం రాజ్యాంగ విలువలకు లోబడి ఉందా? దేశ సమగ్రతను కాపాడుతుందా? అనేది ముఖ్యం. ఏ భావజాలమైనా ఒక వర్గానికో, కులానికో మాత్రమే మేలు చేస్తూ ఇతరులను తక్కువ చేస్తే అది నైతికంగా సరైనది కాదని గుర్తించాలి అని ఆయన స్పష్టం చేశారు.
జ్ఞాన సముద్రం.. ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఏయూ లోగో విశిష్టతను వివరిస్తూ ఇది కేవలం విద్యా ప్రాంగణం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి చిహ్నమని పవన్ కొనియాడారు. లోగోలోని ఉదయించే సూర్యుడు, అరవై నాలుగు తామర రేకులు (చతుషష్టి కళలు), సముద్రం వంటి అంశాలు జ్ఞాన సంపదకు నిదర్శనాలన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.వి. రామన్ వంటి మహనీయుల కృషి వల్లనే ఈనాడు ఏయూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని స్మరించుకున్నారు. తన ఆత్మీయ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడే అణు భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారని ఆయన ద్వారానే ఈ విశ్వవిద్యాలయ గొప్పదనాన్ని తాను వినేవాడినని గుర్తు చేసుకున్నారు.
దేశ భవిష్యత్తుకు మీరే నావికులు
ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా సమాజాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని కోరారు. మీలో న్యూక్లియర్ ఎనర్జీ దాగి ఉంది. మీరు తలుచుకుంటే అద్భుతమైన మార్పును తీసుకురాగలరు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత చురుగ్గా పాల్గొనాలి. నా ఆఖరి శ్వాస వరకు భావి తరాల బాగు కోసమే పనిచేస్తాను అని పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
