Let's talk: editor@tmv.in
దేశ ప్రయోజనాలు తాకట్టు.. ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ ఫైర్

దేశ ప్రయోజనాలు తాకట్టు.. ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ ఫైర్

Pinjari Chand
22 ఫిబ్రవరి, 2026

అమెరికా–భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేయడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ప్రధాని రాజీపడ్డారు… దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

ట్రేడ్ డీల్ కాదు… దేశానికి ‘ఆర్డీల్’

శనివారం ఎక్స్‌లో స్పందించిన రాహుల్ గాంధీ ప్రధాని రాజీపడ్డారు. ఆయన ద్రోహం బహిర్గతమైంది. మళ్లీ చర్చలు జరపరు… మరోసారి లొంగిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ మోడీ తన ఇమేజ్‌ను కాపాడుకోవాలనే ఆత్రుతలో 18 రోజులు వేచి చూడకుండా ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూసి ఉంటే, భారత రైతులు ఈ కష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చేది కాదని విమర్శించారు. రమేశ్ పేర్కొన్న ప్రకారం, ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ (1) మోడీ తనకు మంచి మిత్రుడు, (2) ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్ యథాతథంగా కొనసాగుతుంది, (3) 2025 మే 10న ‘ఆపరేషన్ సిందూర్’ నిలిపివేయాలని తాను టారిఫ్‌ల బెదిరింపుతో ఒత్తిడి తెచ్చానని తెలిపారు. ఫిబ్రవరి 2న లోక్‌సభలో ఏం జరిగింది? అదే రోజు రాత్రి ప్రధాని వైట్ హౌస్‌ను సంప్రదించి ట్రేడ్ డీల్ ప్రకటన చేయించడానికి కారణమేంటి? అంటూ రమేష్ ప్రశ్నించారు. ఇది ట్రేడ్ డీల్ కాదు… దేశానికి మోడీ చేసిన ఆర్డీల్(ఇబ్బందికరమైన సంక్షోభం) అని వ్యాఖ్యానించారు.

ఇండియా ప్రయోజనాలపై ప్రశ్నలు

కాంగ్రెస్ మరో నాయకుడు రణదీప్ సూర్జేవాల కూడా వరుస ప్రశ్నలు సంధించారు. ఐఈఈపీఏ చట్టం కింద అధ్యక్షుడికి టారిఫ్ విధించే అధికారాలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ట్రంప్ ఇప్పుడు ట్రేడ్ యాక్ట్ 1974 సెక్షన్ 122 కింద 10 శాతం అదనపు టారిఫ్ విధించారని ఆయన పేర్కొన్నారు. ఈ టారిఫ్‌లు భారత్‌పై చట్టబద్ధంగా అమలవుతాయా? రైతులు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, ఎనర్జీ నిపుణులు, డేటా నిపుణులు వ్యతిరేకిస్తున్న ఈ ఒప్పందం దేశానికి మేలు చేస్తుందా? అని ప్రశ్నించారు.

• అలాగే దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా, ఇరాన్ నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేస్తామా?

• వ్యవసాయ సబ్సిడీలను ఉపసంహరించమన్న ఒత్తిడిని తిప్పికొడతామా?

• జన్యుమార్పిడి పంటల దిగుమతికి అనుమతి ఇవ్వమని చెప్పగలమా?

• ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్ డాలర్ల అమెరికన్ సరుకులు జీరో టారిఫ్‌పై దిగుమతి చేయాలన్న నిబంధన నుంచి వెనక్కి తగ్గుతామా? అని సుర్జేవాలా ప్రశ్నించారు.

అమెరికా సుప్రీంకోర్టు తీర్పు – ట్రంప్ స్పందన

అమెరికా సుప్రీంకోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో, ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లు చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ తీర్పు ట్రంప్ రెండో పదవీకాల ఆర్థిక అజెండాకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. అయితే, తీర్పు తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇండియాతో ఒప్పందంలో మార్పులేదు. వారు టారిఫ్‌లు చెల్లిస్తారు… మేము చెల్లించం. ఇది సముచితమైన ఒప్పందమన్నారు. మోడీపై ప్రశంసలు కురిపిస్తూ మోడీ గొప్ప వ్యక్తి. ఇండియాతో మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రాజకీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక సమాధానం రావాల్సి ఉంది.