
దేశ నిర్మాణంలో యువతే కీలకం: ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన 18వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన యువతకు 61 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ నియామక పత్రాలు కేవలం ఉద్యోగాలకే కాకుండా దేశ నిర్మాణానికి ఇచ్చిన ఆహ్వానం వంటిదని అన్నారు. యువత తమ బాధ్యతలను రాజ్యాంగానికి అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం మీ జీవితాల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది. నిన్న బసంత్ పంచమి జరుపుకున్నాం. అదే విధంగా మీ జీవితాల్లోనూ కొత్త వసంతం మొదలైంది. మీ కర్తవ్యాలు ఇప్పుడు రాజ్యాంగంతో ముడిపడ్డాయి. రిపబ్లిక్ వేడుకల సమయమిది. నిన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకున్నాం. రేపు జాతీయ ఓటర్ల దినోత్సవమని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు ఐపీఎస్ అధికారులు, సీఆర్‌పీఎఫ్, రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ రోజునే రాజ్యాంగం ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా గుర్తించింది. ఈ శుభదినాన 61 వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందుతున్నాయి. ఇవి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సంకల్ప పత్రాలుగా నిలుస్తాయి. మీ సేవలతో దేశ రక్షణ మరింత బలోపేతం అవుతుంది. ఆరోగ్యం, విద్య, శక్తి భద్రత రంగాలు మరింత బలపడతాయని మోడీ పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను ‘మిషన్ మోడ్’లో అందించేందుకు రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ కార్యక్రమం ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది యువతకు నియామకాలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాల్లో రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువత కలిగిన దేశాల్లో ఒకటని పేర్కొన్న ప్రధాని, యువశక్తికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు పలు దేశాలతో ట్రేడ్, మొబిలిటీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు.
మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు
భారత్‌కు ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని, భారత్–అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే డిసెంబర్ 2025లో న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏ ఖరారైందని పేర్కొన్నారు. భారత్–యూకే, భారత్–ఈయూ ఒప్పందాలు కూడా చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందాలు యువతకు కొత్త అవకాశాలు తీసుకువస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెట్టడంతో నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. దేశంలోని స్టార్టప్ వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 2 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో 21 లక్షలకుపైగా యువత ఉద్యోగాలు చేస్తున్నారు. డిజిటల్ ఇండియా కొత్త ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చింది. యానిమేషన్, డిజిటల్ మీడియా వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. క్రియేటర్ ఎకానమీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని తెలిపారు.
