Let's talk: editor@tmv.in
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతా.. ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోడీ

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతా.. ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోడీ

Bavana Guntha
1 నవంబర్, 2025

560కి పైగా సంస్థానాలను ఏకం చేసి, భారతదేశాన్ని సమైక్య దేశంగా మలిచిన 'ఉక్కు మనిషి' సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారతదేశం శుక్రవారం ఏకమైంది. ఈ దినోత్సవం ఘనమైన నివాళులు, అభివృద్ధి మైలురాళ్లు, దేశ ఐక్యతా స్ఫూర్తిని పునరుద్ఘాటించింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న ఏక్తా నగర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో భాగంగా 'ఐక్యతా ప్రతిజ్ఞ' చేయించారు. వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడతామని ప్రమాణం చేశారు. ఇది సర్దార్ పటేల్ కలలు గన్న బలమైన, ఐక్య భారతదేశానికి ప్రతిబింబంగా నిలిచింది.

స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నివాళులు

182 మీటర్ల ఎత్తైన పటేల్‌ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ పూలమాలలు సమర్పించి నివాళులు ఆరోపించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకలో గణతంత్ర దినోత్సవ శైలిలో పరేడ్‌ నిర్వహించబడింది. సైన్యం, పోలీసు, పారా మిలిటరీ దళాల బృందాలతో పాటు ఎన్ఎస్జీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ వంటి విభాగాల థీమాటిక్ శకటాలు ప్రదర్శించబడ్డాయి.

ప్రధాన ఆకర్షణగా మహిళల ఆధ్వర్యంలో పరేడ్‌ బృందం ప్రధాని మోడీకి సెల్యూట్‌ చేసింది. ఇది దేశ భద్రతా వ్యవస్థలో మహిళల పెరుగుతున్న పాత్రకు ప్రతీకగా నిలిచింది. బీఎస్‌ఎఫ్‌ ఒంటెల బృందం, గుజరాత్‌ పోలీసు గుర్రపు బృందం, అస్సాం పోలీసు మోటార్‌ సైకిల్‌ డేర్‌డెవిల్‌ టీమ్‌ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్‌కు మరింత శోభను జోడిస్తూ భారతదేశం నలుమూలల నుండి వచ్చిన 900 మంది కళాకారులు తమ సాంప్రదాయ, జానపద ప్రదర్శనలతో విచ్చేసిన అతిథులను అలరించారు. కార్యక్రమం చివర్లో భారత వాయుసేన “ఆపరేషన్‌ సూర్యకిరణ్‌”లో భాగంగా ఫ్లై పాస్ట్‌ నిర్వహించింది. ఆకాశం దేశభక్తి రంగులతో నిండిపోయింది.

కెవాడియాలో రూ.1,219 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

పటేల్ జయంతి సందర్భంగా పురస్కరించుకుని ప్రధాని మోడీ కెవాడియాలో రూ.1,219 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇవి మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయి. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు అంకితం చేసిన భవనం (బిర్సా ముండా భవన్), గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఉద్యోగుల కోసం నివాస సముదాయం, కెవాడియా పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచడానికి రూపొందించబడిన హాస్పిటాలిటీ డిస్ట్రిక్ట్‌ తొలి దశ, బోన్సాయ్ గార్డెన్‌, ఈ ప్రాంతంలో సుస్థిర రవాణాను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

ప్రధాని మోడీ తన పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు. "మన దేశానికి ఉక్కు మనిషి అందించిన అపారమైన సేవలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది" అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పటేల్‌కు గౌరవ సూచకంగా ఒక స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. పటేల్ జీవితం, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర, స్వాతంత్య్ర భారత ఐక్యతలో చేసిన కృషి ఆధారంగా రూపొందిన సాంస్కృతిక ప్రదర్శనలో కూడా ఆయన పాల్గొన్నారు.

ఏక్తా నగర్- ఐక్యతకు, అభివృద్ధికి ప్రతీక

2018లో స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభమైన తర్వాత నుండి ఏక్తా నగర్ దేశ గౌరవానికి ప్రతీకగా, ఎకో టూరిజం కేంద్రంగా రూపుదిద్దుకుంది. “వాలీ ఆఫ్ ఫ్లవర్స్”, “జంగిల్ సఫారీ”, “యూనిటీ గ్లో గార్డెన్”, “ఏక్తా క్రూయిజ్” వంటి ప్రదేశాలు దేశ వారసత్వాన్ని ఆధునికతతో మిళితం చేస్తున్నాయి.

హోంమంత్రి అమిత్‌ షా ఏక్తా నగర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని "ప్రతి పౌరుడు ఈ రోజు ఒకే భారతదేశంలో జీవిస్తున్నాడు అంటే అది పటేల్‌ ధైర్యసాహసాల ఫలితం” అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. “దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతికి మా గౌరవ నివాళి” అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.