Let's talk: editor@tmv.in
దేశ ఐక్యతకు శివగిరి తీర్థయాత్ర ప్రతీక: ఉపరాష్ట్రపతి

దేశ ఐక్యతకు శివగిరి తీర్థయాత్ర ప్రతీక: ఉపరాష్ట్రపతి

Pinjari Chand
31 డిసెంబర్, 2025

ఆధ్యాత్మిక జీవితం, సామాజిక జీవితం రెండూ విడదీయరానివని సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చని విశ్వాసం అసంపూర్ణమేనని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ అన్నారు. దేశం ‘వికసిత్ భారత్’ దిశగా ముందుకెళ్తున్న ఈ సమయంలో యంత్రాలు, హైవేలు మాత్రమే కాదు… విలువలు, ఐక్యత, ప్రేమే నిజమైన అభివృద్ధికి ఆధారమని ఆయన స్పష్టం చేశారు. వర్కల సమీపంలోని శివగిరి మఠంలో, మహాసంతుడు, సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు స్థాపించిన 93వ శివగిరి తీర్థయాత్రను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఆధ్యాత్మిక జీవితం, సామాజిక జీవితం వేర్వేరు కావు. విశ్వాసం సమాజాన్ని ఉన్నతంగా మలచకపోతే అది పరిపూర్ణం కాదని ఆయన అన్నారు. భారతదేశ బలమే అన్ని మతాల మధ్య సామరస్యమేనని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ సౌహార్దాన్ని కేంద్ర ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. ఇరాన్‌లో భారతీయులు సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన అంశాన్ని, హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు, బౌద్ధ సర్క్యూట్ల(యాత్ర మార్గాలు) అనుసంధానం వంటి చర్యలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

దేశంలో టూరిజం కేవలం ప్రయాణంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతోందని తెలిపారు. ప్రసాద్ పథకం, వందే భారత్ రైళ్ల విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక అనుసంధానాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రభుత్వం కలుపుతోందన్నారు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్లు ప్రజలను ఏకం చేస్తున్నాయి. ఇవి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా సామరస్యాన్ని పెంచి సమాజాన్ని బలోపేతం చేస్తున్నాయి అని ఆయన చెప్పారు. శివగిరి తీర్థయాత్రే ఈ సామరస్యానికి సజీవ ఉదాహరణగా నిలుస్తోందన్నారు.

సోషల్ మీడియా వల్ల మనసులు చెల్లాచెదురవుతున్న ఈ కాలంలో, యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతుండటం, మాదకద్రవ్యాల ముప్పు, తప్పుడు విజయాల పట్ల మోజు ఆందోళన కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి హెచ్చరించారు. శ్రీ నారాయణ గురు స్ఫూర్తితో పనిచేసే సంస్థలు యువతను సరైన దారిలో నడిపించాలని, తీవ్రవాదాన్ని నిరోధించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ నారాయణ గురు ఆధ్యాత్మికతను తర్కంతో కలిపిన మహానుభావుడని, అంధ విశ్వాసాలను తిరస్కరించి తార్కిక ఆలోచనలకు స్వాగతం పలికారని పేర్కొన్నారు. ప్రేమనే పరమారాధనగా భావించే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఆయన జీవితం అద్దంపట్టిందన్నారు.

కులం, మతం, వర్గభేదాలు లేకుండా వేలాది మంది భక్తులు శివగిరిలో ఏకమవడం ద్వారా ఆధ్యాత్మిక సాధన ఎలా సామాజిక ఐక్యతను నిర్మిస్తుందో స్పష్టమవుతోందన్నారు. ఈ రోజుకీ గురు ప్రభావం కేరళలో విద్య, సామాజిక అభ్యున్నతి, మానవ గౌరవానికి మార్గదర్శిగా కొనసాగుతోందని తెలిపారు. ఆది శంకరాచార్యులు, శ్రీ నారాయణ గురువులను ప్రపంచానికి కేరళ అందించిన గొప్ప వరాలుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో తీర్థయాత్ర అనేది పర్యటన కాదు – అది మానవ పరివర్తన అని వ్యాఖ్యానించారు. శివగిరి నుంచి వెలువడే జ్ఞానం దేశాన్ని సామాజిక న్యాయం, గౌరవం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం వైపు నడిపిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్, వికసిత, శ్రేష్ఠ భారత నిర్మాణానికి మనమందరం కట్టుబడదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ నారాయణ గురుపై నాలుగు పుస్తకాలను విడుదల చేశారు. ఎంపీ శశి థరూర్ రచించిన ‘ది సేజ్ హూ రీమ్యాజిండ్ హిందూయిజం’ పుస్తకం వాటిలో ఒకటి. కార్యక్రమానికి ముందు ఉపరాష్ట్రపతి శివగిరి మఠంలోని శ్రీ నారాయణ గురు సమాధిని దర్శించి నివాళులర్పించారు.