Let's talk: editor@tmv.in
దేశీయ న్యూస్‌ప్రింట్ నాణ్యతపై ఐఎన్‌ఎస్ ఆందోళన

దేశీయ న్యూస్‌ప్రింట్ నాణ్యతపై ఐఎన్‌ఎస్ ఆందోళన

Pinjari Chand
11 మార్చి, 2026

దేశంలో తయారవుతున్న న్యూస్‌ప్రింట్ నాణ్యత, ప్రమాణాలపై ఇండియన్‌ న్యూస్‌పేపర్‌‌ సోసైటీ (ఐఎన్ఎస్‌) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే స్థాయికి దేశీయ తయారీ సామర్థ్యం పెరగకపోతే, పత్రికల ముద్రణ నాణ్యతను కాపాడేందుకు న్యూస్‌ప్రింట్ దిగుమతులు అవసరమేనని పేర్కొంది. ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు వివేక్‌గుప్తా విడుదల చేసిన ప్రకటనలో, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్ (డీపీఐఐటీ) 2024–25 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 123 న్యూస్‌ప్రింట్ మిల్లులు ఉన్నాయని, వాటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 2.2 మిలియన్ టన్నులుగా ఉందని తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవ ఉత్పత్తి గణాంకాలు చూస్తే ఈ సామర్థ్యం పూర్తిగా వినియోగంలో లేదని ఐఎన్‌ఎస్ తెలిపింది. అందువల్ల దేశీయంగా న్యూస్‌ప్రింట్ సరిపడా అందుబాటులో ఉందన్న వాదనలను ఇది ప్రశ్నార్థకంగా మారుస్తుందని పేర్కొంది. కేవలం పరిమాణమే కాదు, నాణ్యత కూడా ప్రింట్‌ మీడియా రంగానికి ముఖ్యమైన అంశమని ఐఎన్‌ఎస్ స్పష్టం చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్) 2022 డిసెంబరులో విడుదల చేసిన న్యూస్‌ప్రింట్ ప్రమాణాల ప్రకారం న్యూస్‌ప్రింట్‌ను గ్రేడ్-1, గ్రేడ్-2గా వర్గీకరించారు.

ఈ రెండు గ్రేడ్‌లు బీఐఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యతలో తేడా ఉందని ఐఎన్‌ఎస్ తెలిపింది. సాంకేతిక ప్రమాణాల పరంగా చూస్తే గ్రేడ్-2 న్యూస్‌ప్రింట్, గ్రేడ్-1తో పోలిస్తే గణనీయంగా తక్కువ నాణ్యత కలిగి ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఐఎన్‌ఎస్ ప్రస్తావించింది. మన ప్రమాణాలు ప్రపంచ ప్రమాణాలకు తక్కువగా ఉండకూడదు. ఉంటే వాటిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో సరిపోలే విధంగా నాణ్యత పెంచితే ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా స్వేచ్ఛా వాణిజ్యం, తెరచిన మార్కెట్లకు కూడా దోహదపడుతుందని గోయల్ వ్యాఖ్యలను ఐఎన్‌ఎస్ తన ప్రకటనలో పేర్కొంది. భారత పత్రికా ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కేవలం ఉత్పత్తి సామర్థ్యం కాదని, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే న్యూస్‌ప్రింట్ అందుబాటులో లేకపోవడమేనని ఐఎన్‌ఎస్ స్పష్టం చేసింది. దేశీయ తయారీ అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకునే వరకు న్యూస్‌ప్రింట్ దిగుమతులు కొనసాగాల్సిందేనని తెలిపింది.