
దేశాన్ని వైట్ హౌస్ నడుపుతుందా? భగవంత్‌మాన్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత కంపెనీలకు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై శనివారం విమర్శలు చేశారు. దేశాన్ని వైట్‌హౌస్ నుంచి నడుపుతున్నారా అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత రిఫైనరీలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చినట్లు వార్తలు రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాన్ చెప్పారు.
రష్యా నుంచి 30 రోజులు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి అనుమతి ఇచ్చిందని వార్తల్లో వచ్చింది. ఆయన భారతదేశానికి అనుమతి ఇస్తారా? మరి దేశాన్ని ఎవరు నడుపుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించాలని ఆయన కోరారు. అమెరికా అధ్యక్షుడి మాటలకు భారత ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటోందో చెప్పాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోడీ గురించి ఏ బలహీనత తెలుసుకున్నాడో తెలియదని, అందుకే ఆయన చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నారని విమర్శించారు. అమెరికా-భారత్ మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు—సోయాబీన్, మొక్కజొన్న—భారత మార్కెట్‌లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇది గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాల కంటే ప్రమాదకరమని అన్నారు. మనం ‘విశ్వగురు’ కావాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు ‘విశ్వ శిష్యులు’ అవుతున్నామని మాన్ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించింది. అనంతరం రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరిన తరువాత ఆ సుంకాలను అమెరికా తొలగించింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా నిలకడగా ఉండేందుకు ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
భారతీయులు ఎవరి స్క్రిప్ట్‌లో నటులు కాదు – రష్యా చమురు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్
రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా భారత్‌కు 30 రోజుల మినహాయింపు ఇచ్చిందన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించింది. భారతీయులు ఎవరి స్క్రిప్ట్‌లో నటులు కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం అమెరికా అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం అవమానం. దీనిపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తన పోస్టులో పేర్కొంది. భారతదేశం స్వాతంత్ర్యం కోసం దీర్ఘకాల పోరాటం చేసిందని గుర్తుచేసిన కాంగ్రెస్, ఏ దేశం కూడా భారతదేశానికి ఆదేశాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
