
దేశాన్ని బలమైన వాణిజ్య భాగస్వామిగా తీర్చిదిద్దడంలో మీ నిర్ణయాలే కీలకం: రాష్ట్రపతి
ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న పరిస్థితుల్లో దేశాల మధ్య సంబంధాలపై కొత్త నియమాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటూ, భారత ఆర్థిక దిశను వచ్చే దశాబ్దాల పాటు ప్రభావితం చేసే శక్తి మీ నిర్ణయాలకు ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భారత వాణిజ్య సేవ (ఐటీఎస్) శిక్షణాధికారులకు సూచించారు.
రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసిన భారత వాణిజ్య సేవ (ఐటీఎస్), భారత ఆడిట్, అకౌంట్స్ సర్వీస్ (ఐఏ, ఏఎస్), డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్ (డీఏక్యూఏ) ప్రొబేషన్ అధికారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సేవల్లో చేరడం ద్వారా తమ వృత్తి జీవితమంతా ప్రతి నిర్ణయం, ప్రతి చర్య ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఐటీఎస్ అధికారులతో ఆమె మాట్లాడుతూ మీరు అమలు చేసే ప్రతి విధానం, మీరు పరిష్కరించే ప్రతి వాణిజ్య అవరోధం, మీరు మద్దతు ఇచ్చే ప్రతి ఒప్పందం — ఇవన్నీ భారతాన్ని బలమైన, ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవనీయమైన వాణిజ్య భాగస్వామిగా ఎదగడంలో సహకరిస్తాయి అన్నారు. మీరు సేవలో చేరిన ఈ కాలం ప్రపంచవ్యాప్తంగా గంభీరమైన మార్పుల సమయం. డిజిటల్ వాణిజ్యం, స్థిరత్వ నిబంధనలు, కొత్త గ్లోబల్ నియమాలు దేశాల పరస్పర వ్యవహారాలను మలుస్తున్నాయి. చట్టం–వ్యాపారం, చర్చలు–వ్యూహం కలిసే ప్రత్యేక స్థితిలో మీరు ఉన్నారు. మీ నిర్ణయాలు భారత ఆర్థిక భవిష్యత్తును దశాబ్దాల పాటు ప్రభావితం చేయగలవని ఆమె పేర్కొన్నారు.
జాతీయ ప్రయోజనాలను మార్గదర్శకంగా తీసుకుని, తెరవెనుక వాణిజ్య విధానాలు, ముఖ్య ప్రాధాన్యతల రక్షణ మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల సృష్టి, భారతీయ వ్యాపారాలు ఆవిష్కరణ చేయడానికి, విస్తరించడానికి, ప్రపంచస్థాయిలో పోటీపడడానికి అనుకూల వాతావరణం సృష్టించడంలో మీ పాత్ర ముఖ్యమని తెలిపారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లో పొందిన శిక్షణ వారికి సమగ్ర విశ్లేషణ సామర్థ్యం, గ్లోబల్ దృష్టికోణం ఇచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఐఏ, ఏఎస్ శిక్షణాధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, బాధ్యతాయుత పరిపాలన వ్యవస్థలో కార్యనిర్వాహక, ఆడిట్ సంస్థల మధ్య సమన్వయం ఉంటే పాలన మెరుగుపడుతుందని అన్నారు. ఆడిట్–కార్యనిర్వాహక భాగస్వామ్యం ప్రజా వ్యయాల సమర్థ వినియోగాన్ని పెంచుతుంది. లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని చెప్పారు. కాగ్ సంస్థ బాధ్యత నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తుందని, రాజ్యాంగ విలువలను ఎల్లప్పుడూ కాపాడాలని సూచించారు.
