
దేశాన్ని కాపాడిన వీరులకు వందనం
మనకి కనిపించే అందమైన సూర్యోదయం వారికి చాలా దూరం. మనల్ని కాపాడే రాత్రి నిద్ర వారికి చాలా అరుదు. మన పిల్లలు ప్రశాంతంగా పాఠశాలకు వెళ్లాలంటే, ఏదో ఒక ప్రమాదం వైపు, మంచుతో కప్పబడ్డ హిమాలయాల్లో, ఒక జవాను తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడే ఉంటాడు. మనకు కనిపించేది కేవలం దేశ రక్షణ. కానీ సైనికునికి కనిపించేది, ఘోర ప్రమాదం, నిరంతర ముప్పు, దేశం పట్ల నిలకడైన ప్రేమ. అలాంటి వీరుల కోసం,వారి త్యాగాన్ని గుర్తుచేసుకోవడం కోసం దేశం సంవత్సరంలో ఒక రోజు కేటాయించింది. అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే డిసెంబర్ 7.
అవును, డిసెంబర్ 7, భారతదేశం ప్రతి సంవత్సరం ఎంతో గంభీరతతో జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం క్యాలెండరులో కనిపించే ఒక తేదీ కాదు. ఇది మన భద్రత కోసం నిశ్శబ్దంగా ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే పవిత్రమైన రోజు. 1949 నుంచి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడు భారత సైన్యం చేసిన కృతజ్ఞతల్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సరిహద్దుల్లో తీవ్ర చలి, ఎడారుల్లో మండే ఎండ, సముద్రంలో అల్లకల్లోలం, ఆకాశంలో సాహసోపేతమైన ఆపరేషన్లు ఏ పరిస్థితుల్లో అయినా భారత జవాను వెనక్కి తగ్గడు. అతని ధైర్యం, విజ్ఞానం, నిబద్ధతే మన దేశాన్ని నిలబెడుతోంది. అలాంటి వీరులకు మనం చేసే నమస్కారం, మనం ఇచ్చే మద్దతు అన్నిటికీ ప్రతీక ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.
ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా ఇది దేశం కోసం త్యాగం చేసిన ప్రతి సైనికుని జ్ఞాపకాన్ని నిలబెట్టే ప్రతీక. మన భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం అంటే మూడు దళాల వీరులు, అమరవీరులు, దేశానికి వారధులు, వీరి కుటుంబాలకు మనం చేసే వందనం ఇది. 1949 నుంచి ప్రతి సంవత్సరమూ నిర్వహిస్తున్న ఈ రోజు ద్వారా మనం అమరవీరులకు ఒక ప్రధాన సందేశం ఇస్తాం.. “దేశం మీ ఋణాన్ని ఎప్పటికీ మరచిపోదు.”అని.
ఫ్లాగ్ డే ఎందుకు ప్రారంభించబడింది?
స్వాతంత్ర౦ తరువాత వందలాది సైనికులు దేశ సంఘీభావం కోసం ప్రాణాలు అర్పించారు. పెళ్లి కాకముందే అమరులైన యువ జవాన్లు, తండ్రి అనే పదం వినకుండానే పెరిగే పిల్లలు.. మరీ చిన్న వయసులో విధవరాలైన సైనిక భార్యలు…తన కొడుకు దేశం కోసం మరణించాడనే గంభీరమైన గర్వంతో పాటు, అతడిని కోల్పోయిన దుఃఖంతో వాడిపోయిన తల్లిదండ్రులు…ఇలాంటి వందల కథలు భారతదేశ హృదయాన్ని కుదిపేశాయి. అప్పుడు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.
“దేశం కోసం ప్రాణం అర్పించిన కుటుంబాలను దేశం ఒంటరినిగా వదిలిపెట్టదు”
ఈ సంకల్పమే ఈ రోజు పుట్టుకకు కారణం అయ్యింది.మొదట్లో ప్రజా విరాళాలతో, చిన్నపాటి స్టిక్కర్ పతాకాలు పంపిణీ చేస్తూ, విరాళాలు పొగుచేస్తూ సైనిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం అది సరిపోదు వారికి ఇవ్వడానికి అనుకుంది. తరువాత ఇది ఒక పెద్ద కార్యక్రమంలా మొదలయ్యింది.
స్వాతంత్రానంతరం భారతదేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, దేశం కోసం వేలాది సైనికులు తమ జీవితాలను అర్పించారు. గాయపడిన వారు, రిటైర్ అయిన వారు, విధుల్లో అమరులైన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఒక స్థిరమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం అనిపించింది. స్వాతంత్ర౦ పొందిన తర్వాత భారతదేశం వివిధ సరిహద్దు ఘర్షణలు, యుద్ధాలు ఎదుర్కొంది. అనేక మంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. గాయపడిన వారు జీవితాంతం బాధలు అనుభవించారు. వారి కుటుంబాలు ఎదుర్కొన్న బాధలను చూసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సైనికుల సంక్షేమం కోసం ప్రజా భాగస్వామ్యంతో నిధులు సేకరించాలి. ఈ నిర్ణయం ఆధారంగా 1949 డిసెంబర్ 7న మొదటి ఫ్లాగ్ డే నిర్వహించబడింది. అప్పటి నుంచి ఇది ప్రతి ఏటా ఒక సంప్రదాయంగా మారింది. ఆరోజు ప్రజలు దేశ చిహ్నాలైన చిన్న స్టిక్కర్ పతాకాలు, పిన్లు, బ్యాడ్జిలు లాంటివి ఏమి కొనుగోలు చేసినా వాటి నుండి లభించిన విరాళాలు సైనిక సంక్షేమ నిధులకు చేరతాయి. ఇది కేవలం ఒక చిహ్నం కాదు. దేశం తన రక్షకులకు చూపే నిజమైన గౌరవం.
ఫ్లాగ్ డే నిధులు - ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారు?
ఫ్లాగ్ డే ద్వారా సేకరించిన ప్రతి రూపాయి సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం వినియోగించబడుతుంది. ముఖ్యంగా యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాల పునరావాసం, గాయపడిన వారి దీర్ఘకాల చికిత్స, పెన్షన్ తర్వాత జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అనేక కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. సైనికుల పిల్లలకు విద్యా స్కాలర్‌షిప్‌లు, వృత్తిపరమైన శిక్షణలు, పునరావాస కార్యక్రమాలు కూడా ఈ నిధులతోనే నడుస్తాయి. ఒక చిన్న విరాళం కూడా ఒక కుటుంబానికి వెలుగులాంటి మార్పు తీసుకురాకపోయినా, అది వారు ఒంటరులు కాదనే సందేశాన్ని ఇవ్వడంలో ఎంతగానో దోహదపడుతుంది. దేశం కోసం రక్తం చిందించిన వాళ్లను గుర్తు చేసుకోవడం, వారి కుటుంబాలను ఆదుకోవడం ఫ్లాగ్ డే అసలైన ఉద్దేశ్యం.
ప్రజల్లో దేశభక్తి జాగృతం చేసే సంకేతదినం
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కేవలం నిధులు సేకరించే కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రజల్లో సైన్యం పట్ల గౌరవాన్ని పెంచే ఒక స్ఫూర్తిదినం. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు పతాకాలను కొనుగోలు చేస్తూ సైనికుల త్యాగం గురించి తెలుసుకుంటారు. సైనికులు, వారి కుటుంబాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి గౌరవం తెలుపుతారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆన్‌లైన్ విరాళాల సౌకర్యం రావడంతో దేశం నలుమూలల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా ప్రచారాలు మరింత విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. మన పక్కన నివసిస్తున్న ఒక మాజీ సైనికునికి నమస్కారం చెప్పడం కూడా ఈ రోజున ప్రత్యేకార్థాన్ని సంతరించుకుంటుంది.
దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లకు మన మద్దతు
దేశ రక్షణ అనేది కేవలం సైన్యం బాధ్యత కాదు. ప్రతి పౌరుడి ధర్మం కూడా. ఒక జవాను దేశం కోసం తన కుటుంబాన్ని వదిలి, తమ జీవితాన్ని అర్పిస్తాడు. అతను అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తాడు. మనకు ఈ శాంతి, స్వేచ్ఛ దక్కేందుకు. కార్గిల్ యుద్ధం నుంచి గాల్వాన్ వరకు, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల నుంచి ప్రకృతి విపత్తుల వరకు, భారత సైన్యం ఎక్కడైనా ముందుండి పోరాడింది. అలాంటి వీరులకు మనం చేసే సహాయం, మనం చూపే గౌరవం ఎంత చిన్నదైనా, అది వారి త్యాగానికి ఒక గొప్ప గుర్తింపు. ఫ్లాగ్ డే మనకు ఇదే బాధ్యతను గుర్తు చేస్తుంది.
ఈ రోజు మనం కొనుగోలు చేసే పతాకం వెనుక కేవలం కాగితం లేదు. మన కృతజ్ఞత ఉంది, మన గౌరవం ఉంది, మన దేశభక్తి ఉంది.యుద్ధంలో ప్రాణాలు అర్పించిన జవాన్ల పిల్లలు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు విద్యాసహాయం అందుతుంది. ఒక తల్లి ఒంటరిగా పడిన బాధను తగ్గించేందుకు ప్రభుత్వం, సైనిక సంక్షేమ సంస్థలు ముందుకు వస్తాయి. దేశం కోసం శరీరాన్ని అర్పించిన వారికి ఆధునిక వైద్య సదుపాయాలు, దీర్ఘకాల చికిత్సలు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతోనే సాధ్యమవుతుంది.రిటైర్ అయిన తరువాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఉద్యోగ అవకాశాలు, శిక్షణ, అన్నింటికీ ఈ నిధులే మూలం. వీరుల పిల్లలకు తమ తండ్రి చేసిన త్యాగం వృథా కాలేదని నిరూపించాలి. వారి చదువు కోసం దేశం మొత్తం కలిసి వెన్నంటే నిలబడుతోందని వారికి తెలియజేయాలి.
డిసెంబర్ 7: దేశభక్తి పండుగ
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది దేశమంతా ఒకే భావంతో ఏకతాటిపైకి వచ్చే రోజు. ఈ రోజు మనం సైనికులకు నమస్కారం చెబుతాం. మన భద్రతకు వారు చేస్తున్న సేవకు కృతజ్ఞత తెలుపుతాం. దేశం చుట్టూ ముప్పులు ఎన్ని ఉన్నా, మన సైన్యం అప్రమత్తంగా ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వాళ్లను గుర్తు చేసుకోవడంలో మనం వెనుకడుగు వేయకూడదు. ఒక చిన్న సహాయం, ఒక చిన్న పతాకం, ఒక చిన్న విరాళం… ఇవి అన్నీ కలిసి దేశాన్ని కాపాడే మహత్తర శక్తికి మనం ఇస్తున్న మద్దతు.
ఫ్లాగ్ డే మనకు గుర్తు చేస్తుంది “వీరుల త్యాగాన్ని వందనం చేయడం మన పౌర ధర్మం.” మనమందరం ఒకటిగా నిలబడి, ఈ డిసెంబర్ 7న భారత సైన్యానికి మన గౌరవం, మన ప్రేమ, మన మద్దతును తెలుపుదాం. ఫ్లాగ్ డే అనేది కేవలం నిధుల సేకరణ కాదు. మనం ఇక్కడ ఆనందంగా ఉండటానికి మనకు లభిస్తున్న స్వేచ్ఛ, భద్రత ఎక్కడి నుంచి వస్తోందో గుర్తు చేసే రోజు. ఈ రోజున స్కూల్ పిల్లలు చిన్న పతాకాలు కొనుగోలు చేస్తూ సైనికుల జ్ఞాపకాలను తలుస్తారు. కాలేజీలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాయి.ప్రభుత్వ సంస్థల్లో సైనికుల కుటుంబాలను సత్కరిస్తారు కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు. పిల్లలు “జై జవాన్!” అంటూ నినాదాలు చేస్తారు. ఇలా ఆ రోజంతా దేశం మొత్తం జవాను చేసిన త్యాగం కోసం ఒకే గుండే చప్పుడుగా కొట్టుకుంటుంది. సైన్యం కోసం నిలబడే నాగరికతలు ఎప్పుడూ వెనుకబడవు.
అందుకే ఫ్లాగ్ డే అనేది ఒక సాధారణ దినం కాదు, దేశభక్తిని మేల్కొలిపే జాతీయ పండుగ.
మన సరిహద్దుల్లో మంచు తుపాన్లు వీస్తున్నా,మన జవాను పోస్ట్‌ను వదిలి రాడు. మన పిల్లలు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, ఒక సైనికుని పిల్లలు తండ్రిని ఇంకో ఆరు నెలలు చూడలేరు. మన పండుగల్లో మనం కుటుంబంతో కలిసి విందు చేస్తే, వారు బంకర్‌లో వడగండ్లను దాటిస్తూ తినే భోజనమే వారికి పండుగ. ఇలాంటి వీరులకు మనం ఇచ్చే గౌరవం, వారికి లభించే అత్యంత గొప్ప పురస్కారం. ఫ్లాగ్ డే మనకు చెబుతుంది. “వీరులని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం.” ఈ రోజు మనమందరం ఒక్కసారిగా గళం విప్పి చెప్పాలి. “జై హింద్! వీర జవాన్లకు వందనం! నీవు ఉన్నావు… కాబట్టి దేశం ఉన్నది!”
