
దేశాన్ని ఏకం చేసిన మంత్రం ‘వందేమాతరం’: ప్రధాని మోడీ
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో వందేమాతరం పై పార్లమెంట్ లో జరిగిన చర్చలు వేడెక్కించాయి. ఇరుపక్షాలు వాగ్భాణాలను సంధించుకున్నాయి. జాతీయ గీతం ‘వందే మా తరం’ను అవమానించినందుకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం లోక్‌సభలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో లేకపోవడాన్ని ఎత్తిచూపారు. ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ లొంగిపోయిందని, వందే మాతరంపై రాజీ పడిందని ఆరోపించారు. పార్లమెంటులో తీవ్ర చర్చ జరుగుతోంది, కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇక్కడ లేరు. మొదట నెహ్రూ, ఇప్పుడు రాహుల్ గాంధీ వందే మాతరంపై అవగాహన లేకుండా వ్యవహరించారు అని మోడీ అన్నారు. నెహ్రూ-ముస్లిం లీగ్ ఒడంబడిక గురించి ప్రధాని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఇప్పటికీ వందే మాతరాన్ని అవమానిస్తోంది. ముస్లిం లీగ్ ముందు లొంగిపోయి, వందే మాతరంపై రాజీ పడింది. నెహ్రూ వందే మాతారాన్ని ‘తుక్కు తుక్కు’ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ రాసిన లేఖలో ‘వందే మాతరం ముస్లింలను రెచ్చగొడుతుంది’ అని రాశారు. ఇది వందే మాతరంతో జరిగిన ద్రోహం అని ఆరోపించారు.
వందే మాతరం స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిందని, దేశ ప్రజలను ఏకం చేసిన మంత్రంగా నిలిచిందని ప్రధాని కొనియాడారు. వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతిని మేల్కొల్పేందుకు బంకించంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించారు. ఇది రాజకీయ స్వాతంత్య్రం కోసం మాత్రమే కాదు, మన సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక రూపం అని ఆయన అన్నారు.
1905లో బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం ఎదురు నిలిచిందని, బ్రిటిష్ విభజన రాజకీయాలను ఎదిరించిందని గుర్తుచేశారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భం చారిత్రాత్మకం. ఈ మంత్రాన్ని తరతరాలకు చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
వందే మాతరం 50 ఏళ్లు నిండినప్పుడు భారత్ బ్రిటిష్ పాలనలో ఉండగా, 100 ఏళ్లు నిండినప్పుడు అత్యవసర పరిస్థితి అమలులో ఉండటం దురదృష్టకరమని మోడీ అన్నారు. ఇప్పుడు 150 ఏళ్లు పూర్తి చేసుకునే సమయంలో మనం ఈ గొప్ప వారసత్వాన్ని మరలా స్థాపించాలి. 2047 నాటికి స్వయం సమృద్ధ, అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించే సంకల్పాన్ని పునరుద్ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శిస్తూ ఇక్కడ నాయకత్వం, ప్రతిపక్షం అన్న తేడా లేదు. వందే మాతరం రుణం తీర్చుకునేందుకు అందరూ కలిసి రావాలి. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దేశాన్ని ఏకం చేసిన ఈ గేయాన్ని మళ్లీ మనల్ని ఏకం చేయాలని మోడీ అన్నారు. ఈ చర్చ కోసం ఎన్డీఏకి మూడు గంటలు, మొత్తం చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. రేపు (డిసెంబర్ 9) రాజ్యసభలోనూ ఈ చర్చ కొనసాగనుంది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు సాగనున్నాయి.
‘బంకిందా’ అనడం పై టీఎంసీ అభ్యంతరం
‘వందే మాతరం’ రచయిత బంకించంద్ర చటర్జీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘బంకిందా(దా అంటే దాదా అని అర్థం)’ అని పిలవడంపై లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. దీంతో ప్రధాని వెంటనే ‘బంకింబాబు’ అని సవరించుకున్నారు. వందే మాతరం 150 ఏళ్ల చర్చలో టీఎంసీ సభ్యుడు సౌగత రాయ్ జోక్యం చేసుకుని‘బంకించంద్ర చటర్జీని ‘బంకింబాబు’ అని పిలవాలి సార్’ అని సూచించారు.
దీంతో ప్రధాని స్పందిస్తూ సరే బంకింబాబు అంటాను. మీ సూచనలను గౌరవిస్తాను. థాంక్స్ అని చెప్పారు. అనంతరం హాస్యంగా నిన్ను మాత్రం ఇప్పటికీ ‘దాదా’ అని పిలవచ్చు కదా? ఏమైనా అభ్యంతరమా? అని అడిగారు. అందుకు సభలో నవ్వులు పూశాయి. సీనియర్ నేత సౌగత రాయ్ పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్ నుంచి ఐదోసారి ఎంపీగా గెలిచారు. బెంగాలీ సాంస్కృతిక గౌరవం ప్రకారం మహానుభావుల పేరుకు ‘బాబు’ అని వాడటం ఆనవాయితీ.
విరుచుకుపడ్డ మహువా మోయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో “వందేమాతరం” గీతం 150 ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకునే చర్చలో పాల్గొని బీజేపీపై తీవ్ర ధ్వజమెత్తారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ వందేమాతరాన్ని ఆయుధంగా వాడుతోందని, 1937లోని తీర్మానం కంటే ఎక్కువగా ఈ గేయం ఆత్మను బీజేపీనే నాశనం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్‌లోని అర్ధం తెలియని వ్యక్తి ‘వందేమాతరం కార్డును సరిగ్గా ఆడితే 2026 బెంగాల్ ఎన్నికల్లో లాభం చేకూరుతుంది’ అని సలహా ఇచ్చి ఉంటాడు. అందుకే ఈ చర్చ ఈ సమయంలో జరుగుతోందని ఎద్దేవా చేశారు.
టీఎంసీ ఈ చర్చను స్వాగతిస్తోందని ఇది మీరు బెంగాల్ ఆత్మకు ఎంత దూరమైపోయారో, మా మాతృభూమి మీ ఇరుకైన ఎన్నికల లక్ష్యాలకు ఎప్పటికీ బందీ కాదని నిరూపిస్తుందని అన్నారు. బీజేపీ ఎంపీలు వందేమాతరం సరిగ్గా పాడలేరని ఎగతాళి చేస్తూ, పార్టీ దేశభక్తి చెడుగా రాసిన కామెడీ లాంటిదని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం మత విభజనను పెంచుతూ వందేమాతరం ఆదర్శాలను నటిస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం చంద్రుడినే విభజించింది. హిందూ మహిళలు కర్వా చౌత్‌కు చంద్రుడిని చూడొచ్చు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ముస్లిం ఈద్ నమాజుకు అదే చంద్రుడిని చూడకూడదు. ఇలాంటప్పుడు దేశ విభజనకు వందేమాతరమే కారణమంటారా? నిజమైన బెంగాలీగా, బీజేపీ ‘బంగ్లాదేశీ, రోహింగ్యా’ అని అవమానిస్తూ, గర్భిణీ స్త్రీలను కూడా సరిహద్దు దాటిస్తున్న పది కోట్ల బెంగాలీల తరపున మాట్లాడుతున్నాను అని పేర్కొన్నారు.
వందే మాతరం చర్చలో చరిత్రను ‘తిరగరాయాలని’ ప్రధాని ప్రయత్నం: కాంగ్రెస్
లోక్‌సభలో వందే మాతరం 150 ఏళ్ల చర్చలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం చరిత్రను తిరగరాయడానికి, దానికి రాజకీయ రంగు పులమడానికే ఉద్దేశించిందని కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది. బీజేపీ ఎంత ప్రయత్నించినా జవాహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలపై ఒక్క మచ్చ కూడా పడదని పార్టీ స్పష్టం చేసింది. వందే మాతరానికి జాతీయ గేయం హోదా ఇచ్చి, దానికి అర్హమైన గౌరవాన్ని అందించింది కాంగ్రెస్ మాత్రమేనని పార్టీ నేతలు గుర్తు చేశారు.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ ప్రధాని ఏ విషయం మీద మాట్లాడినా నెహ్రూ, కాంగ్రెస్ పేర్లు తప్పనిసరిగా తీసుకుంటారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో నెహ్రూ పేరు 14 సార్లు, కాంగ్రెస్ పేరు 50 సార్లు వచ్చింది. రాజ్యాంగం 75వ వార్షికోత్సవంలో నెహ్రూ పేరు 10 సార్లు, కాంగ్రెస్ 26 సార్లు ప్రస్తావించారని లెక్క చూపారు. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాకూర్ మొదటిసారి ‘వందే మాతరం’పాడారు. 1905 బనారస్ సమావేశంలో సరళా దేవి చౌదరాణి పాడి, గేయంలోని ‘సప్తకోటి’ని ‘త్రింశత్ కోటి’గా మార్చి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. 1937లో ముస్లిం లీగ్ ఒత్తిడి ఉన్నా, కాంగ్రెస్ మొదటి రెండు శ్లోకాలను జాతీయ సమావేశాల్లో పాడేలా నిర్ణయం తీసుకుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వందే మాతరంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ప్రధాని ప్రసంగంలో రెండు ఉద్దేశాలు కనిపించాయి – చరిత్రను తిరగరాయడం, ఈ చర్చకు రాజకీయ రంగు పులమడం. మీ రాజకీయ పూర్వీకులు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని గోగోయ్ విమర్శించారు. ఎంత ప్రయత్నించినా నెహ్రూ సేవలపై ఒక్క మచ్చ కూడా పడదు. ఆ విషయం మీకు, మీ పార్టీకి గౌరవపూర్వకంగా చెప్తున్నామని ఆయన హెచ్చరించారు. ముస్లిం లీగ్ పూర్తిగా వందే మాతరాన్ని బహిష్కరించాలని కోరగా, కాంగ్రెస్ ప్రజల భావాలకు అనుగుణంగా మొదటి రెండు శ్లోకాలను జాతీయ గీతంగా ఆమోదించిందని గోగోయ్ గుర్తుచేశారు. హిందూ మహాసభ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా కాంగ్రెస్ తన నిర్ణయంపైనే నిలబడిందని ఆయన పేర్కొన్నారు.
వందే మాతరం ‘రాజకీయ ఆయుధం’ కాదు: అఖిలేష్ యాదవ్
స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని వారు ఇప్పుడు ‘వందే మాతరం’ విలువల గురించి మాట్లాడుతున్నారని బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభలో ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవ చర్చలో పాల్గొని, జాతీయ గేయాన్ని తమ నమ్మకాలను, ఇతరులపై కట్టుబాటు చేసే సాధనంగా ఉపయోగించకూడదని ఆయన హెచ్చరించారు. వందే మాతరం ఆత్మలో అనుసరించాల్సిన గేయం అని, స్వాతంత్ర్య సమరంలో ప్రజలను ఏకం చేసిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. వందే మాతరం ప్రదర్శన కోసం కాదు, రాజకీయ సాధనం కాదు. వారు మాట్లాడేటప్పుడు, ఈ శ్లోకాన్ని వారు సృష్టించినట్టు అనిపిస్తుందని ట్రెజరీ బెంచ్‌ల వైపు చూపుతూ ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని వ్యక్తులు ‘వందే మాతరం’ అర్థాన్ని ఎలా అర్థం చేసుకోగలరని అఖిలేష్ ప్రశ్నించారు. ఈ రోజు విభజన వాదులు వందే మాతరాన్ని విభజనలు సృష్టించడానికి ఉపయోగిస్తున్నారు. వీరు కూడా బ్రిటిష్ వారిలా ‘విభజించు పాలించు ’ విధానాన్నే అనుసరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ట్రెజరీ బెంచ్‌లో ఉన్న వారు అందరినీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారని, అధికార పక్షం వారు తమకు సంబంధం లేని ఐకానిక్ నాయకులను స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు. బంకించంద్ర చటర్జీని స్మరించుకుని, ఈ గేయాన్ని కోట్లాది మందిని మేల్కొల్పిందని, రవీంద్రనాథ్ టాగోర్ గేయంలోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు.
వందే మాతరం పూర్తిగా గుర్తుండకపోయినా, ఆ రెండు పదాలు చెప్పడం వల్లే గర్వాన్ని రేకెత్తిస్తుందని, ప్రజల హృదయాల్లో ఇది లోతుగా నాటుకుపోయిందని చెప్పారు. వందే మాతరం మాత్రమే పాడటం కంటే, దాని ఆత్మను అమలు చేయడం ముఖ్యమని విలేకరులతో మాట్లాడిన అఖిలేష్ పాడటం కంటే చేయడం ముఖ్యం. రాజ్యాంగంలో అనేక ఆదేశాలు ఉన్నాయి. బాబా సాహెబ్ భీమరావ్ అంబేడ్కర్ మార్గం చూపారు. దేశం స్వతంత్రంగా, న్యాయవంతంగా ఉండాలి, సామాజిక న్యాయం అందాలని అన్నారు. అఖిలేష్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అంతరాయం ప్రయత్నించగా, ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను (అయోధ్య నుంచి గెలిచిన దళిత నేత) లేపి, ‘ఇంకో దళిత్, అల్పసంఖ్యక నేతను చూడండి’ అని హాస్యంగా స్పందించారు. బీజేపీ 1980లో స్థాపన సమయంలో సోషలిస్ట్, సెక్యులర్ మార్గాన్ని స్వీకరించిందని, ఇప్పుడు ఎంతమంది సెక్యులర్ సోషలిస్టులు మిగిలారని ఆయన ప్రశ్నించారు.
