
దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్‌డిఆర్ఎఫ్, హైడ్రా, ఐసీసీసీ విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆధునిక పరికరాల కొనుగోలుపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం ఖచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్‌టైమ్ మానిటరింగ్, విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
విపత్తుల నిర్వహణలో పనిచేసే సిబ్బందికి మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మండల స్థాయి వరకు అడ్వాన్స్డ్ వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగులు, వంకలు, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎయిర్‌లిఫ్ట్ మెకానిజం సిద్ధం చేయాలని, 70 నుంచి 80 కిలోల బరువును మోయగల డ్రోన్లను కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. 2024లో పాలేరు నియోజకవర్గంలో సరైన ఎయిర్‌లిఫ్ట్ వ్యవస్థ లేక బాధితులను రక్షించలేకపోయిన ఘటనను గుర్తుచేశారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలతోనూ కమ్యూనికేషన్ సాధ్యమయ్యేలా సిమ్ ఆధారిత విహెచ్‌ఎఫ్ రేడియో వ్యవస్థలను విస్తరించాలని ఆదేశించారు. నగరంలోని హైరైజ్ భవనాల్లో అగ్నిప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, 77 హైస్పీడ్ బోట్లు కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. ప్రస్తుతం ఉన్న 12 ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలకు నిరంతర శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐసీసీసీ డైరెక్టర్ కమల్ హాసన్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
