
దేశానికే 'రైల్వే హబ్'గా హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో హైదరాబాద్ నగరం త్వరలోనే అతిపెద్ద "రైల్వే హబ్"గా అవతరించనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కిన ప్రాధాన్యతను వివరించారు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, అలాగే ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌కు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌కు ఈ ప్రాధాన్యం దక్కనుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.47 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 30కి పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు 2026 నాటికి పూర్తవుతాయని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో మొత్తం 1,242 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ ఉండగా, అందులో ఇప్పటికే 627 కిలోమీటర్లకు కవచ్ భద్రతా వ్యవస్థను అమలు చేశామని చెప్పారు. రైళ్ల ప్రమాదాలను నివారించడంలో కీలకమైన కవచ్ వ్యవస్థకు సంబంధించిన పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్‌ను కేంద్రంగా నిర్మించనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.
• హైదరాబాద్–పుణె
• హైదరాబాద్–బెంగళూరు
• హైదరాబాద్–చెన్నై
ఈ హైస్పీడ్ కారిడార్లతో దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ మరింత వేగవంతమైన రైలు అనుసంధానాన్ని పొందుతుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే ఫార్మా, వ్యాక్సిన్లు, రక్షణ రంగం, ఐటీ రంగాల్లో ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు ‘కవచ్’ సెంటర్, హైస్పీడ్ రైల్ కారిడార్లతో రైల్వే రంగంలోనూ హైదరాబాద్ దేశానికి హబ్‌గా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు.
మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మూడో దశలో భాగంగా హైదరాబాద్‌ను యాదగిరిగుట్ట దేవాలయ పట్టణంతో అనుసంధానించే ప్రాజెక్టుకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ నిర్వహించే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించినట్లు వెల్లడించారు.
వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్
అలాగే 2026–27 కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు అని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపును రూ.88 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకాన్ని బలహీనపరుస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలు అసత్యమని ఆయన విమర్శించారు.
ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న సమయంలో, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాలకంటే దీర్ఘకాలిక అభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
