


దేశానికే ఆదర్శం.. తెలంగాణలో అతిపెద్ద హైకోర్టు సముదాయానికి శ్రీకారం
తెలంగాణ న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని నగర శివారులోని రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్‌లో అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో నిర్మించనున్న 'హైకోర్టు జోన్-II' భవన సముదాయానికి ఆదివారం పునాది రాయి పడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి, జస్టిస్ అలోక్ అరదే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు పలువురు మాజీ న్యాయమూర్తులు, అధికారులు హాజరయ్యారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ అవసరాలకు వేదికగా నిలవనుంది.
వందేళ్ల అవసరాలకు అద్దం పట్టేలా..
సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నూతన హైకోర్టు ప్రాంగణం, దేశంలోనే అతిపెద్ద న్యాయ సముదాయంగా రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం చారిత్రక వారసత్వ కట్టడం కావడంతో పాటు, పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా వసతులు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో, రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక కోర్టు గదులు, డిజిటల్ లైబ్రరీలు, ఐటీ మౌలిక సదుపాయాలతో కూడిన ఈ భవనాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో న్యాయమూర్తుల నివాస గృహాలు (క్వార్టర్లు), ఇతర అనుబంధ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యం
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయ మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని పేర్కొన్నారు. కొత్త భవన సముదాయం అందుబాటులోకి వస్తే కేసుల విచారణ మరింత వేగవంతమై, సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత విలువైన భూమిని కేటాయించి, న్యాయవ్యవస్థ బలోపేతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ నూతన ప్రాంగణం ద్వారా తెలంగాణ న్యాయ రంగానికి కొత్త గుర్తింపు లభించడమే కాకుండా, డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.
ప్రజాస్వామ్య దేవాలయం: సీఎం రేవంత్ రెడ్డి
శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “హైకోర్టు భవన నిర్మాణానికి పునాది వేయడం నా జీవితంలో అరుదైన, గర్వించదగ్గ ఘట్టం” అని తెలిపారు. న్యాయస్థానాల నిర్మాణం కేవలం భవనాల నిర్మాణం కాదు, ప్రజాస్వామ్యానికి పునాది వేసినట్టేనని పేర్కొన్నారు.
“కోర్టు అనేది ప్రజలందరికీ దేవాలయం. కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం అందించే పవిత్ర స్థలం” అని సీఎం అన్నారు. స్వతంత్ర భారతంలో అన్ని మతాల ప్రజలకు సమాన న్యాయం అందించేందుకు నిర్మించబడుతున్న ఈ ఆధునిక హైకోర్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాధాన్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని, రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ సముదాయం 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జోన్–I పనులు కొనసాగుతున్నాయని, జోన్–II (నివాస సముదాయం) నిర్మాణం వేగవంతం చేస్తున్నామని వివరించారు.
న్యాయవ్యవస్థకు ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడం కార్యనిర్వాహక శాఖ బాధ్యత. న్యాయం వేగంగా అందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేయాలని, ప్రభుత్వంగా తీర్పులు, సూచనలను అత్యంత గౌరవంతో స్వీకరిస్తామని తెలిపారు.
పురాతన హైకోర్టు చారిత్రక ప్రాముఖ్యత ఉండినా, ప్రస్తుత అవసరాలు తీర్చలేకపోతున్న నేపథ్యంలో ఆధునిక సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. 49 కొత్త కోర్టులు, నివాస సముదాయాల పనులు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా సాగుతున్నాయన్నారు. హైదరాబాద్ చరిత్రలో ఇవాళ ప్రత్యేక రోజు. రాబోయే శతాబ్దానికి నిలిచే ప్రజాస్వామ్య స్తంభాన్ని నిర్మించే దిశగా ఇది కీలక అడుగు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త హైకోర్టు ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.2,583 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
యువత క్రీడలకు దూరం కావడం దేశానికి ప్రమాదకరం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన 74వ బోలానాథ్ ముల్లిక్ స్మారక ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2026 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది. క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూనే, యువత పెడదోవ పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని యువత క్రీడా మైదానాలను వదిలివేస్తున్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందని ఆయన హెచ్చరించారు.
భారత ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు ఉన్న విశిష్టతను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. 1950-60 దశకంలో హైదరాబాద్ నగరం 'నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్'గా పేరుగాంచిందని, 1956 ఒలింపిక్స్‌లో ఆడిన భారత జట్టులో ఏడుగురు ఆటగాళ్లు హైదరాబాద్ వారేనని ఆయన గర్వంగా ప్రకటించారు. అటువంటి చారిత్రక నగరంలో జాతీయ స్థాయి పోలీస్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఒలింపిక్ పతకాలు - ఆత్మవిమర్శ
140 కోట్ల జనాభా కలిగిన భారత్ ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోవడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించాలని సీఎం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు ఓడిపోగానే కొద్దిరోజులు చర్చించి ఆ తర్వాత విస్మరిస్తున్నారు. గతంలో గచ్చిబౌలీలో ఎన్నో క్రీడలు జరిగేవి, కానీ గడిచిన కొన్నేళ్లుగా వాటిని పట్టించుకోలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల ముప్పు - యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ
యువత మాదకద్రవ్యాల వలలో పడి నిర్వీర్యమైపోతున్నారని సీఎం ఆందోళన చెందారు. వీరుల భూమిగా పేరున్న పంజాబ్‌లో సైతం ఈరోజు డ్రగ్స్ గురించి వినాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' ని నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వంటి సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసు విభాగం ముందుండాలని సీఎం పిలుపునిచ్చారు. మైదానంలో క్రీడాకారులు ప్రదర్శించే స్ఫూర్తిని సమాజంలోని నేరాలను అరికట్టడంలో కూడా చూపాలని సూచించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగిన ఈ టోర్నీ ముగింపులో సీఎం స్వయంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రతిభ కనబరిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
