Let's talk: editor@tmv.in
దేశానికి కొత్త మోడల్‌గా కేరళ

దేశానికి కొత్త మోడల్‌గా కేరళ

Pinjari Chand
2 నవంబర్, 2025

కేరళ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం నుంచి అత్యంత పేదరికం పూర్తిగా తొలగిపోయిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ‘కేరళ పిరవి’ సందర్భంగా సీఎం విజయన్ చేసిన ఈ ప్రకటన చారిత్రాత్మకమని తెలుపుతూ ఇది దేశానికి మరో కొత్త మోడల్ అని గర్వంగా తెలిపారు.

90% పేదరికం నుంచి పేదరికరహిత రాష్ట్రంగా

1961–62లో కేరళలో పేదరిక స్థాయి దేశంలోనే అత్యధికం. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 90.75 శాతం. పట్టణాల్లో 88.89 శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారని యుఎన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌ (సీడీఎస్‌) చేసిన అధ్యయనం వెల్లడించిందని సీఎం విజయన్ గుర్తుచేశారు. అప్పటి నుంచి కేరళ అభివృద్ధి దిశగా ప్రయాణించిన తీరు అద్భుతం. అదే కేరళ ఇప్పుడు అత్యంత పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా భారతదేశంలో నిలిచిందని సీఎం సగర్వంగా ప్రకటించారు.

పేద నిర్మూలనకు మూడు సంవత్సరాల ప్రణాళిక

రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆర్థిక సంవత్సరాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. 2023–24, 2024–25: ఒక్కో సంవత్సరం రూ.50 కోట్లు కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.60 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటిని ఆరోగ్య సేవలు, గృహనిర్మాణం, జీవనోపాధి సృష్టి, విద్యా సహాయం వంటి విభాగాలకు వినియోగించామని సీఎం తెలిపారు.

లైఫ్ మిషన్, భూమిలేని వారికి భూమి

లైఫ్ మిషన్ ద్వారా 4,677 కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మించారు. 2,713 కుటుంబాలకు భూమి, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఇళ్ల మరమ్మతులకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు ప్రత్యేక నిధులు ఇచ్చింది. భూమిలేని వారికి భూమి కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 28 ఎకరాలు గుర్తించారు.అదే సమయంలో ‘మనస్సొదితిరి మన్ను’ అనే కార్యక్రమం పేరుతో దాతల సహకారంతో 2.03 ఎకరాల భూమి అందించామని తెలిపారు.

ఎవరూ ఆకలితో ఉండరాదు: సీఎం విజయన్

ఎవరూ ఆకలితో ఉండరాదు. అవసరమైన వారికి కొత్త ఇళ్లు, భూమి అవసరమైన వారికి భూమి ఇచ్చాం. పునర్నిర్మాణం అవసరమైన వారికి ఆర్థిక సాయం ఇచ్చాం. ప్రతి దశలో సీఎం స్థాయి నుంచి పర్యవేక్షణ జరిగింది. అందరి సహకారంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకున్నామని ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ విజయానికి పలు ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, అధికారులు కలిసి పని చేశారని తెలిపారు. అలాగే కుటుంబశ్రీ, లైఫ్ మిషన్, కెఐఎల్ఏ, స్థానిక స్వయం పాలనా సంస్థలు, ఆహార, ఆరోగ్య, విద్య, వ్యవసాయ, సాంఘిక న్యాయం, మహిళాభివృద్ధి వంటి విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేశాయని వివరించారు.

కేరళ ఎప్పుడూ సంక్షేమ కార్యక్రమాలకు ప్రయోగశాలగా నిలిచింది. అత్యంత పేదరిక నిర్మూలనలో కూడా మా ప్రయోగం దేశానికి ఆదర్శం అవుతుంది. స్థానిక సంస్థలు, ప్రజలు, అధికారులు కలిసి చేసిన కృషి ఫలితమే ఈ విజయం. ఈ నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని ఆశిస్తున్నానని సీఎం ఆకాంక్షించారు.

కేరళ ఎప్పటినుంచో విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అత్యంత పేదరిక నిర్మూలనలో కూడా దేశానికి కొత్త దిశ చూపింది. సాంఘిక సంక్షేమ పథకాలు, కుడుంబశ్రీ మహిళా సమూహాల కృషి, స్థానిక పాలనా సంస్థల సమన్వయం, ఇవన్నీ కలిసి ఈ విజయానికి బలమైన ఆధారాలుగా నిలిచాయి. ఇక మిగతా రాష్ట్రాలు ఈ కేరళ మోడల్ ను అనుసరిస్తే దేశవ్యాప్తంగా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తక్కువ సమయం, బడ్జెట్ లో ఎలా సాధ్యమైంది?

కేరళ ప్రభుత్వం 2023–2026 మధ్య మూడు సంవత్సరాల్లోనే ‘అత్యంత పేదరిక నిర్మూలన’ ఎలా సాధించగలిగిందని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.? మొత్తం రూ.160 కోట్లు మాత్రమే కేటాయించి, చిన్న బడ్జెట్‌తో పేదరికాన్ని ఏ విధంగా తుడిచిపెట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు వ్యూహం “ధన వనరులు కాదు – సమన్వయ పాలన, ప్రజా భాగస్వామ్యం, శక్తివంతమైన వ్యవస్థలు పనిచేశాయి.

అత్యంత పేదరికం అంటే

కేరళ ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ నిర్వచనాలను ఆధారంగా తీసుకుంది.

ప్రపంచబ్యాంక్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు $2.15(180–190) అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం (2022 నాటికి ప్రస్తుత ప్రమాణం) కలిగి ఉండటం. ఒక వ్యక్తి తినడానికి, నివసించడానికి, ఆరోగ్య సంరక్షణకు, చదువుకోవడానికి సరిపడా అవసరాలు తీర్చుకోలేని స్థితి. దీన్ని అంతర్జాతీయ దారిద్య్ర రేఖ అని పిలుస్తారు. ఈ ప్రమాణాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రపంచ వ్యాప్తంగా 2022 పర్చేసింగ్ పవర్ పారిటి (పీపీపీ)ఆధారంగా లెక్కిస్తుంది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం:

యునైటెడ్ నేషన్స్ తన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లో మొదటి ప్రాధాన్యత పరంగా పేదరికాన్ని ఇలా నిర్వచించింది.

‘అత్యంత పేదరికం’ అంటే వ్యక్తి లేదా కుటుంబం ఆహారం, తాగునీరు, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అవసరాలను తీర్చుకోలేని స్థితి. కేవలం ఆదాయం మాత్రమే కాదు. బహుళ పేదరికం అనే భావనను కూడా చేర్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 64,000కు పైగా కుటుంబాలు ‘అత్యంత పేదలు’గా గుర్తించారు.

వీరిని పూర్తిగా ప్రధాన స్రవంతిలోకి తేవడమే లక్ష్యం.

బడ్జెట్ తక్కువే..కానీ వ్యవస్థ పెద్దది

మొత్తం రూ.160 కోట్లు అంటే రాష్ట్ర స్థాయిలో చిన్న మొత్తమే.కానీ దీన్ని నేరుగా నగదు పథకంలా కాకుండా, ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలతో అనుసంధానించారు.

లైఫ్ మిషన్ ద్వారా — గృహాలు

• కుటుంబశ్రీ మిషన్ ద్వారా — స్వయం ఉపాధి, సమూహ బలోపేతం

• ఎంఎన్ఆర్ఈజీఏ ద్వారా — గ్రామీణ ఉపాధి

• ఆరోగ్య, విద్య, సామాజిక న్యాయం శాఖలు — వైద్యసహాయం, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు

• స్థానిక స్వయం పాలన సంస్థలు — సమగ్ర పర్యవేక్షణ

అంటే ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టలేదు. కానీ ఉన్న పథకాలనే సమన్వయం చేసి లక్ష్యంపై దృష్టి సారించారు.

దీన్ని కన్వర్జేన్స్ మోడల్ అని పిలుస్తారు.

డేటా ఆధారిత మానిటరింగ్

కేరళలో ప్రతి గ్రామపంచాయితీ స్థాయిలో ఎక్స్‌ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ సెల్ ని ఏర్పాటు చేశారు.దీంట్లో భాగంగా ప్రతి కుటుంబ స్థితిగతులపై డిజిటల్ డేటా రూపొందించారు. జిల్లా, బ్లాక్ స్థాయిల్లో రియల్ టైమ్ ట్రాకింగ్, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా సమీక్షలు చేశారు.దీని వలన నిధులు వృథా కాకుండా, నేరుగా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారు.

భూమి, ఇండ్లకు ప్రాధాన్యం

అత్యంత పేదరికానికి ప్రధాన కారణం ‘భూమి లేకపోవడం, ఇల్లు లేకపోవడం’ అని గుర్తించి, లైఫ్ మిషన్​ ను ప్రధాన సాధనంగా చేశారు.

కుటుంబ శ్రీ మిషన్ – మహిళల శక్తి

కుటుంబశ్రీ మిషన్ కేరళలో అద్భుతంగా పనిచేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామస్థాయిలో పేద కుటుంబాలను గుర్తించాయి. వీరు ఉపాధి కల్పించడం, స్వయం ఉపాధి ప్రాజెక్టులు నడిపారు ఇది ప్రభుత్వానికి గ్రాస్ రూట్ టెన్షన్ సిస్టమ్”గా మారింది.