
దేశానికి ‘అచ్చే దిన్’ లేవు: సంజయ్ రౌత్
వీర సావర్కర్‌కు భారత్‌రత్న ఎందుకు ఇవ్వడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం బీజేపీని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అడగాలని సూచించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం సావర్కర్‌కు ఇవ్వాలన్న మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై రౌత్ వ్యగ్యంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది సంఘ్ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారంతా సంఘ్ స్వయంసేవకులే. లక్షలాది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రమతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి సావర్కర్‌కు భారత్‌రత్న ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లెక్చర్‌ల్లో మాట్లాడటానికి బదులు, ఈ విషయాన్ని నేరుగా ప్రధాని, హోంమంత్రిని అడగాలని భాగవత్‌కు సూచించారు. సావర్కర్‌కు భారత్‌రత్న ఇస్తే ఆ పురస్కార గౌరవం మరింత పెరుగుతుందని భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) రూపురేఖలపై కూడా సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి ‘అచ్చే దిన్’ లేకపోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌దే బాధ్యతని వ్యాఖ్యానించారు. “సంఘ్ ఆధ్వర్యంలో బీజేపీకి అచ్చే దిన్ వచ్చాయి. కానీ బీజేపీ పాలనలో దేశానికి అచ్చే దిన్ దూరమయ్యాయి. భారత్ అమెరికాకు బానిసగా మారింది. దీనికి సర్‌సంఘ్‌చాలక్ బాధ్యత వహించాలని అన్నారు. ఒప్పందాలు మన షరతుల ప్రకారమే ఉండాలని సంఘ్ నేతలు చెబుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన షరతులకు భారత్ లొంగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు సంఘ్ ప్రచారక్‌గా ఉన్న ప్రధాని హయాంలోనే దేశం అమెరికా ఆధీనంలోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు.
భారత్–అమెరికా సంయుక్త ప్రకటన ప్రకారం, భారత వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకం విధించనుండగా, భారత్ అమెరికా పారిశ్రామిక వస్తువులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు లేదా తొలగించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం భారత ప్రయోజనాలకు విరుద్ధమని ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి.
