
దేశవ్యాప్తంగా హెచ్‌పీవి టీకా కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని మోడీ
రాజస్థాన్‌లోని అజ్మేర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవి) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలో మహిళల ఆరోగ్య రక్షణలో, ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలకు ఈ టీకా ద్వారా భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ కల్పించనున్నారు.
ఈ జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా కర్తవ్య భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే ఎయిమ్స్ న్యూఢిల్లీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, ఆర్‌ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలకు చెందిన ప్రముఖ వైద్యులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, హెచ్‌పీవి టీకా కార్యక్రమం భారతదేశంలోని ‘నారీ శక్తి’ని మరింత బలపరిచే కీలక చర్యగా పేర్కొన్నారు. “ఒక కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు. తల్లి అనారోగ్యానికి గురైతే ఇంటి మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ భావనతోనే మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది,” అని ఆయన అన్నారు. మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలను ఆయన గుర్తు చేశారు.
పారిశుధ్య కార్యక్రమాల కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం, తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్ల అందుబాటు, అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా కోట్ల కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. అదేవిధంగా సురక్షిత మాతృత్వ పథకం కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారం కోసం రూ.5,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం నుంచి సంరక్షణ, గౌరవం వైపు దేశం మారుతోందని ఆయన స్పష్టం చేశారు.
అజ్మేర్‌లో జరిగిన ఈ జాతీయ ప్రారంభ కార్యక్రమానికి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గవర్నర్లు, రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లు, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు, విద్యా మంత్రులు, ఉన్నత ఆరోగ్య అధికారులు తమ తమ రాష్ట్ర కేంద్రాల నుంచి వర్చువల్‌గా పాల్గొని కార్యక్రమంలో భాగమయ్యారు.
గర్భాశయ క్యాన్సర్ భారత్‌లో మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబోకాన్ 2022 నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 1.2 లక్షల కొత్త కేసులు, దాదాపు 80 వేల మరణాలు నమోదవుతున్నాయి. హెచ్‌పీవి వైరస్‌లోని 16, 18 వంటి అధిక ప్రమాదకర రకాలతో దీర్ఘకాలిక సంక్రమణే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని వైద్య పరిశోధనలు స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలోనే హెచ్‌పీవి టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది. దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత జాతీయ టీకాల సాంకేతిక సలహా బృందం ఈ టీకాను సిఫార్సు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలు తమ జాతీయ టీకా కార్యక్రమాల్లో హెచ్‌పీవి టీకాను అమలు చేస్తున్నాయి.
భారత్‌లో ఈ కార్యక్రమం కింద గార్డాసిల్-4 (హెచ్‌పీవి రకాలు 6, 11, 16, 18) టీకాను ఒకే డోసుగా అందించనున్నారు. ఈ క్యాంపెయిన్ 90 రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం సాధారణ టీకా దినాల్లో కూడా ఈ టీకా అందుబాటులో ఉంటుంది. టీకా పూర్తిగా ఉచితం, అలాగే తల్లిదండ్రుల అనుమతితోనే ఇవ్వబడుతుంది.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలలో మాత్రమే ఈ టీకా అందిస్తారు. లబ్ధిదారులు యు-విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు లేదా నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లవచ్చు. ప్రతీ టీకా సెషన్‌లో భద్రత, శీతలీకరణ యంత్రాల నిర్వహణ, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ హెచ్‌పీవి టీకా కార్యక్రమం భారతదేశంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణకు ఒక కొత్త దిశను చూపిస్తోంది. 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది.
