Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా సీసీటీవీ–కంట్రోల్ రూమ్ నెట్‌వర్క్: ఎంహెచ్‌ఏ

దేశవ్యాప్తంగా సీసీటీవీ–కంట్రోల్ రూమ్ నెట్‌వర్క్: ఎంహెచ్‌ఏ

Pinjari Chand
17 ఫిబ్రవరి, 2026

మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు, సమగ్ర కంట్రోల్ రూమ్‌ల నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ప్రణాళిక రూపొందిస్తోంది. రాబోయే నెలల్లో కొత్త జాతీయ భద్రతా వ్యవస్థ (నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్)కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సీసీటీవీ నెట్‌వర్క్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సమన్వయం, రియల్‌టైమ్ మానిటరింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయనుంది. దీనికి తగిన చట్టపరమైన మద్దతు కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

సరిహద్దు భద్రతకు ఆధునికీకరణ

దేశంలోని ప్రతి భూ సరిహద్దు వెంట భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా ఆధునికీకరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సర్వైలెన్స్ వ్యవస్థల మెరుగుదల, కంచెలను బలపరచడం, ఆధునిక సాంకేతికత వినియోగం, సరిహద్దు భద్రతా దళాల మధ్య సమన్వయం పెంపు వంటి చర్యలు చేపడతామని చెప్పారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యమన్నారు.

కొత్త క్రిమినల్ చట్టాల అమలు

మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికీ ప్రాధాన్యం ఇస్తామని, పోలీసు సంస్థలు సరికొత్త న్యాయవ్యవస్థకు అనుగుణంగా శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2029కు ముందే ఈ సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు హింస నుంచి పూర్తిగా విముక్తి చేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. గతంలో 11 రాష్ట్రాలకు విస్తరించిన నక్సలిజం ఇప్పుడు గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు 80 శాతం వరకు తగ్గినట్లు పేర్కొన్నారు. ఈశాన్యంలో 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలి జన జీవన ప్రవాహంలోకి వచ్చారని, 20కు పైగా శాంతి ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.

ఢిల్లీ పోలీసులకు ప్రశంస

ఢిల్లీ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ, పార్లమెంట్‌పై దాడి నుంచి రెడ్ ఫోర్ట్ సమీపంలోని పేలుడు ఘటన వరకు క్లిష్టమైన కేసులను ఛేదించడంలో ఢిల్లీ పోలీసులు కీలక పాత్ర పోషించారని మంత్రి అన్నారు. దేశ అంతర్గత భద్రత పరంగా 2014–2026 కాలాన్ని సువర్ణ యుగంగా చరిత్ర గుర్తుంచుకుంటుందని అమిత్ షా పేర్కొన్నారు.