Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ టీకా : కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ టీకా : కేంద్ర ప్రభుత్వం

Pinjari Chand
25 ఫిబ్రవరి, 2026

మహిళల్లో మొదటి దశలోనే సర్వైకల్ క్యాన్సర్ ను గుర్తించి నివారించగలిగే వీలున్న క్యాన్సర్ల నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. 14 ఏళ్ల బాలికలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర కేబినేట్ లో కీలక నిర్ణయం తీసుకుంది.

సింగిల్-షాట్ ‘గర్దసిల్’ వినియోగం

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ టీకా అయిన గర్దసిల్ సింగిల్-డోస్ రూపంలో వినియోగించనున్నారు. ఇది ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైపులు 16, 18తో పాటు 6, 11 నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్‌లో ‘గర్దసిల్-4’ టీకా 15 ఏళ్ల లోపు బాలికలకు రెండు డోసులు (ఒక్కో డోస్ ధర సుమారు రూ.3,927) అవసరం. 15 ఏళ్లు పైబడిన వారికి మూడు డోసులు అవసరం. ఈ టీకాను ఎంఎస్డీ ఇండియా తయారు చేస్తోంది.

ఉచిత, స్వచ్ఛంద టీకా

ఈ కార్యక్రమం ప్రభుత్వ సర్వసాధారణ టీకా కార్యక్రమం (యూఐపీ) కింద కాకుండా ప్రత్యేక డ్రైవ్‌గా నిర్వహించనున్నారు. టీకా పూర్తిగా ఉచితంగా, స్వచ్ఛందంగా అందిస్తారు. సామాజిక-ఆర్థిక వర్గాల మధ్య సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

డబ్ల్యూహెచ్ వో సిఫార్సులకు అనుగుణంగా

ఈ కార్యక్రమం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన గ్లోబల్ స్ట్రాటజీకి అనుగుణంగా ఉంది. 14 ఏళ్ల వయసులో టీకా వేయడం ద్వారా వైరస్‌కు గురయ్యే ముందు ఎక్కువగా రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయ ఆధారాలు ఒకే డోస్ టీకా కూడా బలమైన, దీర్ఘకాలిక రక్షణనిస్తుందని సూచిస్తున్నాయి.

గ్లోబల్ అనుభవం

2006లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకుపైగా డోసులు వినియోగించారు. 93 నుంచి 100 శాతం వరకు ప్రభావవంతంగా సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించగలదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. భారత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, హెచ్ పీవీ టీకాను జాతీయ టీకా షెడ్యూల్‌లో చేర్చిన 160 దేశాల సరసన చేరుతుంది. 90కుపైగా దేశాలు సింగిల్-డోస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

క్యాన్సర్ భారాన్ని తగ్గించే లక్ష్యం

భారతదేశంలో మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు 80,000 కొత్త కేసులు, 42,000కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. హెచ్ పీవీ టైపులు 16, 18 కలిసి 80 శాతం కేసులకు కారణమవుతున్నాయి.

ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహణ

టీకా కార్యక్రమం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (పీహెచ్సీస్)లో నిర్వహించనున్నారు. ప్రతి టీకా కేంద్రాన్ని 24/7 వైద్య సదుపాయాలతో అనుసంధానం చేస్తారు. టీకా సరఫరా కోసం భారత్, గవి, ది వ్యాక్సిన్ అలయన్స్ భాగస్వామ్యంతో పారదర్శక విధానంలో నాణ్యమైన టీకాలను సమకూర్చుకుంది. అధికారులు తల్లిదండ్రులు ముందుకు వచ్చి 14 ఏళ్ల కుమార్తెలకు టీకా వేయించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఆరోగ్య రక్షణలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.